బుద్ధునిలో ఉంది
భవిష్యత్ యుద్ధంలో కాదు..
భువనేశ్వర్:
మన భవిష్యత్ యుద్ధాల్లో లేదని బుద్ధుని ఆలోచనల్లో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ విలువలను సజీవంగా ప్రతిబింబించేందుకు ప్రవాస భారతీయుల్ని ఒక వేదికపై సమాహారంగా సమావేశపరిచినట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్–టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగాలూతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్, నేపథ్య ప్రదర్శనలను గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్ మరియు ఇతర ప్రముఖ మంత్రులు పాల్గొన్నారు. మూడుసార్లు గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్ ప్రదర్శనతో 18వ ప్రవాస భారతీయ దివస్ ఉత్సవం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఈ ఉత్సవం నిర్వహించడం తూర్పు భారతదేశం అభివృద్ధి, సాంస్కృతిక ప్రాధాన్యతకు పట్టం గడుతుందని, నరేంద్ర మోదీ ప్రభుత్వ పూర్వోదయ విధానం ప్రాముఖ్యతని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జయ శంకర్ ఉద్ఘాటించారు.
జనవరి 9 చారిత్రాత్మకం
ప్రవాస భారతీయులను స్వాగతిస్తూ, జనవరి 9కి చారిత్రాత్మకమైన ప్రాముఖ్యత కూడా ఉందని ప్రధాని మోదీ అన్నారు. మహాత్మా గాంధీ సుదీర్ఘకాలం విదేశాల్లో గడిపిన తర్వాత 1915లో భారతదేశానికి ఇదే రోజున తిరిగి వచ్చారని గుర్తు చేశారు. ఒడిశా వారసత్వాన్ని ప్రాముఖ్యపరుస్తూ ఈ భూమి భారత దేశం యొక్క గొప్ప వారసత్వానికి పట్టుగొమ్మగా పేర్కొన్నారు. ఉదయగిరి, ఖండగిరి గుహలు, కోణార్క్ ఆలయం, తామ్రలిప్తి, మాణిక్‌పట్న వంటి పురాతన నౌకాశ్రయాలు ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లని గుర్తు చేశారు. ఈ సంపద దేశానికి అపారమైన గర్వాన్ని ప్రసాదిస్తుందన్నారు. భారత దేశపు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాముఖ్యతను వివరిస్తూ భారత దేశం కేవలం ప్రజాస్వామ్య తల్లి మాత్రమే కాదని ప్రజాస్వామ్యం మన జీవన విధానంలో పాతుకుపోయిందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
ధౌలీ క్షేత్రం మహనీయం
మానవజాతి ప్రయోజనాల కోసం యుద్ధం అక్కరకు రానే రాదని, అభివృద్ధి పథంలో పయనించాల్సిన అవసరాన్ని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఒడిశా ధౌలికి పుట్టినిల్లని, ఇది శాంతికి చిహ్నమని అన్నారు. ప్రపంచం ఒకరినొకరు కత్తులతో దూసుకున్న భయానక అమానుషకర పరిస్థితుల్లో సామ్రాట్ అశోకుని మహనీయునిగా మలిచిన అద్భుత నేలగా కొనియాడారు. ధౌలి కేంద్రంగా ఒడిశాలో ‘శాంతి మరియు ధర్మం’ మార్గాన్ని అశోక చక్రవర్తి ఎంచుకుని మానవీయ విలువలకు నాంది పలికాడని తెలిపారు. రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టీన్ కార్లా కంగాలూ ముఖ్య అతిథిగా చేసిన వర్చువల్ అడ్రస్‌ని ఈ సదస్సులో ప్రదర్శించారు. ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన కింద ప్రత్యేక పర్యాటక రైలు అయిన ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌ని ఆయన ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ సేవల్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరింది. రైలు ప్రవాస భారతీయుల్ని మూడు వారాల పాటు దేశంలోని వివిధ మతపరమైన, పర్యాటక ప్రాంతాలను చుట్టి తీసుకువస్తుందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఘనంగా 18వ ప్రవాస భారతీయ
దివస్
Comments
Please login to add a commentAdd a comment