స్ట్రా బెర్రీ సాగు పరిశీలన
రాయగడ: పొరుగు జిల్లా గజపతికి చెందిన మోహన, గోషాణి, కాశీనగర్, గుమ్మ సమితులకు చెందిన రైతులు రాయగడ జిల్లాలోని రామనగుడలో సాగవుతున్న స్ట్రా బెర్రీ, గులాబీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి లాభదాయకమైన పంటలను గురువారం పరిశీలించారు. రామనగుడ బీడీవో ప్రద్యుమ్న మండల్ రైతులకు ఈ మేరకు ఈ సాగుపై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు కలిగిన వాణిజ్య పంటల్లో భాగంగా స్ట్రా బెర్రీ , డ్రాగన్ ఫ్రూట్ వంటివి రైతుల ఆర్థిక పురోగతికి ఎంతగానో దోహదపడతాయన్నారు. రైతులు తగిన మెలకువలు తెలుసుకుంటూ లాభసాటి వ్యవసాయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన వీటిని సాగుచేయాలని సూచించారు. ఈ క్రమంలో రైతులు ఇక్కడి పంటలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
లారీ బోల్తా
రాయగడ: జిల్లాలోని జిమిడిపేట సమీపంలో రాజహంస వద్ద విశాఖపట్నం నుంచి రాయిపూర్‌కు బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి లారీ డ్రైవరు సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న శశిఖాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చేరుకుని దర్యాప్తు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
రాష్ట్రపతి ఆగమనం
భువనేశ్వర్: ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో పాలుపంచుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరారు. ఈ సందర్భంగా స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆమెకి పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతించారు. ముఖ్యమంత్రితో రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి కూడా హాజరై రాష్ట్రపతికి స్వాగతం పలికారు. శుక్రవారం ముగింపు వేడుకల్లో ఆమె ప్రసంగించనున్నారు.
నోట్లు చూపించి..
బంగారం లాగేశారు
జయపురం: పట్టణంలో రోజురోజుకు నేరాలు పెరుగుతున్నాయి. గురువారం ఒక రైతు దారిలో పోతుండగా దుండగుల ఆ మార్గంలో కరెన్సీ న ఓట్లు వేసి రైతును ఏమార్చి బంగారు నగలు దోచుకుపోయారు. జయపురం సమితి ఉమ్మిరి గ్రామం సమీప 26వ జాతీయ రహదారిలో ఒక రైతు దొంగల బారిన పడ్డాడు. అతడు పుట్ర గ్రామానికి చెందిన మహేశ్వర బెహర. పోలీసుల వివరణ ప్రకారం.. రైతు మహేశ్వర బెహర పొలం పనులకు డబ్బు అవసరమై తన భార్య బంగారు నగలు జయపురం యూనియన్ బ్యాంక్‌లో కుదవ పెట్టాడు. గురువారం భార్య నగలు విడిపించేందుకు జయపురం యూనియన్ బ్యాంక్‌కు వెళ్లి డబ్బు జమ చేసి నగలు విడిపించి నగలు బ్యాగ్‌లో పెట్టి మధ్యాహ్నం బైక్‌లో బయల్దేరాడు. ఉమ్మిరి గ్రామం సమీపం 26వ జాతీయ రహదారిలో ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. తర్వాత మరో యువకుడు మరో బైక్‌పై వస్తూ రోడ్డుపై డబ్బులు పడిపోయాయని రైతుకు తెలిపాడు. తన డబ్బులు పడిపోయాయో ఏమోనని భమలో రైతు బైక్ స్లో చేస్తూ చూడగా 10, 20 రూపాయల నోట్లు కనిపించాయి. వాటిని చూస్తూ ఉండగా దుండగులు బైక్ హ్యాండిల్‌కు తగిలించి ఉన్న నగల బ్యాగ్‌ను తీసుకుపోయారు. ఈ నగల విలువ రూ.2.30 లక్షలు ఉంటుందని రైతు తెలిపాడు. వెంటనే ఆయన జయపురం సదర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్, గవర్నర్ హరిబాబు
Comments
Please login to add a commentAdd a comment