నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి
రాయగడ: స్థానిక చెక్కాగుడ సమీపంలోని నాగావళిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మృతులను శ్రీను కుమార్ యాదవ్ (11), సీహెచ్ భార్గవ్ చరణ్ (11)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను వెలికి తీసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగారు. వివరాల్లోకి వెళితే..
స్థానిక దీప్తి కాన్వెంట్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న భార్గవ్, శ్రీనులతో పాటు స్థానిక రాణిగుడఫారానికి చెందిన నమ్మాజయ్ సామంత, మరో విద్యార్థి రోప్‌వే బ్రిడ్జి వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. బాల్ ఆట ఆడుతుండగా బాల్ రోప్ వే బ్రిడ్జి కిందకి పడిపోయింది. శ్రీను, భార్గవ్ బాల్ తీసుకునేందుకు కిందకు వెళ్లారు. నదిలో పడిన బాల్‌ను తీస్తుండగా కాలుజారి భార్గవ్ నదిలో పడిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో శ్రీను కూడా నదిలో దూకాడు. దీంతో ఇద్దరూ కొట్టుకుపోయి చనిపోయారు. తోటి విద్యార్థులు విషయాన్ని సమీపంలో గల వారికి చెప్పగా.. అక్కడి వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
తరచూ ప్రమాదాలు
చెక్కగుడ నుంచి మంకొడొ జొల ఆ పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మెరుగుపరిచేందుకు నాగావళి నదిపై రోప్‌వే బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ రోప్‌వే బ్రిడ్జిని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు ఈ ప్రాంతానికి వెళ్లి తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అదేవిధంగా మజ్జి గౌరి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఎంతో మంది ఇక్కడ ఫొటోలు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో జిల్లా యంత్రాంగం రెండేళ్ల కిందట రోప్ వే బ్రిడ్జిని మూసివేసింది. బ్రిడ్జి లోపలకు ప్రవేశించకుండా ప్రవేశ ద్వారాన్ని మూసివేశారు. కానీ కొందరు లోపలకు వెళ్తూనే ఉన్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment