భువనేశ్వర్: రాష్ట్రంలో పెట్టుబడుల్ని గణనీయంగా పెంచేందుకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రవాస భారతీయుల్ని ప్రోత్సహించారు. ఒడిశాలో పెట్టుబడులు భవిష్యత్‌కు భద్రత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహంతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పిలుపునిచ్చారు.
18వ ప్రవాస భారతీయ దివస్ ప్రారంభోత్సవం పురస్కరించుకుని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరు అయిన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఒడిశా వ్యాపారానికి అనువైన ప్రదేశమని, బహుముఖ వ్యాపారాలకు ఈ రాష్ట్రంలో అద్భుతమైన అవకాశాలు నెలకొని ఉన్నాయని తెలిపారు. ఒడిశా అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అన్నారు. ప్రవాస భారతీయుల సదస్సుని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ పూర్వోదయ మిషన్‌్ కార్యక్రమంలో ఒడిశా కేంద్ర బిందువుగా ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒడిశా శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రకృతి అందాలకు కొలువై చిలికా, గోపాల్‌పూర్, షిమిలిపాల్ తదితర పర్యావరణ ప్రాధాన్యత కలిగిన పర్యాటక కేంద్రాలు ప్రపంచ ఆకర్షణగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. జాతీయ స్థాయిలో ఒడిశా రెండో అతి పెద్ద ఖనిజ ఉత్పత్తిదారు కావడంతో వ్యాపార రంగంలో గట్టి పట్టుని కలిగి ఉందని గుర్తు చేశారు. రైల్వే, ఓడ రేవులు, విమానాశ్రయాలు తదితర జాతీయ, అంతర్జాతీయ రవాణా, ప్రసార రంగాలకు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు సాధించగా ఒడిశా 2047 నాటికి 1.5 ట్రిలియన్ (1 లక్షా 50 వేల) డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఇప్పటి నుంచే పునాది పడనుంది. 2036లో సుసంపన్నమైన ఒడిశాను నిర్మించేందుకు అన్ని రకాల సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఒడిశాలో పెట్టుబడులు పెట్టడం అంటే భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడమేనని ముఖ్యమంత్రి మోహన్ మాఝీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment