శ్రీనివాసా.. గోవిందా
భువనేశ్వర్: పవిత్ర వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనానికి సౌకర్యం కల్పించారు. ఈ సదుపాయం ఈ నెల 11వ తేదీ శనివారం కూడా అందుబాటులో ఉంటుందని ఆలయ అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరవధికంగా ఈ కార్యక్రమాలు కొనసాగాయి. వెంకటేశ్వర శతక పారాయణం, శ్రీ విష్ణు సహస్ర నామాలు, లలిత సహస్ర పారాయణం, అన్నమయ్య సంకీర్తనాలాపన, ఒడియా, హిందీ భజన సంగీతం, చిన్నారులతో ఒడిస్సీ, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, మహిళల కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ నుంచి విచ్చేసిన డాక్టరు త్యాగరాజ శాస్త్రి విశ్వమేలువాడ వేంకటేశ మకుటం శీర్షికతో ఆలాపించిన శ్రీ వెంకటేశ్వర శతకం మంత్రముగ్ధుల్ని చేసింది. ముక్కోటి ఏకాదశి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యకలాపాల్లో పాలుపంచుకున్న కళాకారులు, సాహితీవేత్తలు ఇతర వర్గాలకు ప్రత్యేకంగా సత్కరించారు. టీటీడీ వాద్య బృందం నాదస్వరంతో దేవస్థానం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో అలముకుంది. దేవస్థానం ప్రాంగణంలో వేద ఆశీర్వచనం వేదిక, ఆరోగ్య శిబిరం, ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి ఆలయం ద్వారాలు తెరిచారు. ఏకాంత సేవతో ఏకాదశి ఉత్సవాలకు తెర దించారు.
Comments
Please login to add a commentAdd a comment