నిత్యావసర సరుకుల పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు నిత్యావసరాలు శుక్రవారం పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, నూనె, బంగాళ దుంపలు, ఉల్లి తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకురాలు ఎం.నళిని తెలియజేశారు. ప్రతినెలా ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులకు రగ్గులు పంపిణీ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి నూవగూడ గ్రామంలోని అంబేడ్కర్ విద్యాలయంలోని రెండు వందల మంది విద్యార్థులకు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, రగ్గులు, బెడ్‌షీట్లు పంపిణీ చేశారు. బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్ చరణ్ మాహంతి మాట్లాడుతూ.. శీతాకాలంలో పిల్లలు చలితో ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వీటిని సమకూర్చామన్నారు. న్యాయవాదులు హేమంత్ కుమార్ రాజ్, జోసెఫ్ జేమ్స్, బిజు సర్కార్, బసంత్ సాగరియా, రుమ్పా దేవ్‌నాథ్ పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలు
ఘనంగా నిర్వహిద్దాం
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 26న జరగనున్న గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ ఫరూల్ పట్వారి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే విధంగా సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ తదితరులు పాల్గొన్నారు.
కుంద్రలో
ఎలుగుబంట్ల అలజడి
● భయం గుప్పెట్లో ప్రజలు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్రా సమితి కుంద్ర గ్రామంలోనికి ఎలుగు బంట్లు ప్రవేశించాయి. దీంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. మూడుకుపైగా ఎలుగుబంట్లు గ్రామ పరిసరాలలో సంచరిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. అడవిలో ఆహారం లభించక ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తున్నాయని చెబుతున్నారు. గ్రామస్తులు ఎలుగుల నుంచి తమకు రక్షణ కల్పించాలని అటవీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది ఎలుగుబంట్లను గ్రామ ప్రాంతం నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎలుగుబంట్ల దాడి చేసిన ఘటనను తలచుకొని భయపడుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఎలుగుదాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. అదేనెల 29వ తేదీ వృద్ధుడిపై దాడి చేసి చంపేసింది.
Comments
Please login to add a commentAdd a comment