దేశ పురోగతికి ప్రవాస భారతీయులే వారధి
భువనేశ్వర్: ప్రవాస భారతీయులు భరత జాతికి గర్వ కారణమని, ప్రపంచ దేశాల్లో మన దేశానికి అత్యుత్తమంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. స్థానిక జనతా మైదాన్‌లో 18వ ప్రవాసీ భారతీయ దినోత్సవం ముగింపు పురస్కరించుకుని శుక్రవారం జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. పవిత్ర భారత భూమిలో సంపాదించిన జ్ఞానం, నైపుణ్యాలతో ప్రపంచ దేశాల్లో ఆదర్శవంతులుగా వెలుగొందడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. స్వదేశంలో జరిగిన ఈ భారీ ఉత్సవానికి విచ్చేసిన కొంత మంది ప్రవాస భారతీయులకు ప్రత్యేక పతకాలతో సత్కరించడం గొప్ప అదృష్టమని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవం కేవలం వేడుక మాత్రమే కాదని, ఆలోచనలను మార్పిడి చేసుకునే గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. మాతృ భూమితో ప్రవాస భారతీయుల అవినావభావ సంబంధాల్ని నిరంతరం పదిలపరిచే బృహత్తర సంకల్పంతో భారత ప్రభుత్వం పలు కార్యక్రమాల్ని చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో ప్రవాస భారతీయులంతా చురుకై న పాత్రధారులుగా ముందడుగు వేయడంతో మన దేశంతో ఇతర ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని రాష్ట్రపతి అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో మీ సహకారం చాలా అవసరమని ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా 24 దేశాల నుంచి వచ్చిన 27 మంది ప్రముఖ ప్రవాస భారతీయులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పతకాలతో సత్కరించారు. అనంతరం ప్రవాస భారతీయ దివస్ ప్రాంగణ సముదాయంలో ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలు ఆమె సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment