షోరూంలో అగ్ని ప్రమాదం
రాయగడ: స్థానిక బాలాజీనగర్ సమీపంలోని ఎస్‌కే మార్ట్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెడీమేడ్ దుస్తులు, షోరూం ఫర్నీచర్ కాలి బూడిదయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. షోరూం యజమాని కాశీనాథ్ సాహు ఎప్పటిలాగే గురువారం రాత్రి వ్యాపార లావాదేవీలు ముగించుకుని షోరూం మూసివేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆ ప్రాంతంలో కొంతమంది వాకింగ్ చేస్తున్న సమయంలో షోరూం నుంచి దట్టమైన పొగలు రావడంతో వెంటనే షోరూం యజమానికి, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అప్పటికే షోరూం మొత్తం దగ్ధమైనట్లు తెలిసింది. సంక్రాంతి పండగ కావడంతో పెద్ద ఎత్తున స్టాక్ ఉంచామని, ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి నష్టం వాటిళ్లిందని యజమాని వాపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలనే ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపక కార్యాలయం అధికారి రమేష్ చంద్ర బెహర అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment