ఆనాడే స్పందించి ఉంటే మళ్లీ పారిపోయే వారు కాదు
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి మండిపాటు
నాదెండ్ల: విద్యార్థుల సమస్యలపై ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు సరిగ్గా స్పందించి ఉంటే విద్యార్థులు పారిపోయే సంఘటనలు చోటు చేసుకోవని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి చెప్పారు. యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సోమవారం ఆమె సందర్శించారు. ఈ పాఠశాలలో గడిచిన నెల రోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు విద్యార్థులు గోడ దూకి పారిపోయిన సంఘటన విదితమే. ఈ విషయమై ఆమె రెండోదఫా పాఠశాలను సందర్శించారు. విద్యార్థ్ధులతో మాట్లాడారు. మొదటి దఫా సుమారు 67 మంది, రెండోదఫా ఏడుగురు విద్యార్థులు పరారవటంపై విచారించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్ధంచేసుకుని పరిష్కరించి ఉంటే పరిస్థితి సాధారణంగా ఉండేదని పేర్కొ న్నారు. దీనిపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సిఫార్సు మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారన్నారు.
విద్యార్థులకు సరిగ్గా భోజనం పెట్టకపోవటం, వారిచే టాయిలెట్లు కడిగించటం వంటి పనులు చేయించటం శోచనీయమన్నారు. దుర్వ్యసనాలకు అలవాటు పడిన ఇరవై మంది విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోకుంటే డ్రాపవుట్‌లుగా మిగిలిపోతారని, కావున త్వరలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి వారిని తిరిగి పాఠశాలలో చేర్చుకుంటామన్నారు.
ఉపాధ్యాయులు పాఠశాల క్వార్టర్స్‌లోనే నివశించాలి
గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాఠశాలలోని క్వార్టర్స్‌లోనే ఉండాలన్నారు. అయితే వీరు వివిధ ప్రాంతాల్లో ఉంటూ రోజూ రాకపోకలు సాగించటంతోనే విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తుందన్నారు. విద్యార్థులను తరచూ పర్యవేక్షించటం, సరైన క్రమశిక్షణ ఉండేలా చూడటం ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. జిల్లా కోఆర్డినేటర్ పద్మజకు ఈ విషయమై పలు సూచనలు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment