మరణమే శరణమా!
పోలీసు స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్య
సత్తెనపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి రూరల్ పోలీసు స్టేషన్ ఎదుట బుధవారం జరిగింది. మేడికొండూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన ఒంటిపులి కోటిస్వాములు (35) సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామానికి చెందిన తేనె అంకమ్మను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె. కొంతకాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడచూపాయి. తేనె అంకమ్మ తన తండ్రి మాటలు విని చీటికిమాటికి పుట్టింటికి వెళ్లి తండ్రిచేత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయిస్తోంది. ఈక్రమంలో భార్య పెట్టిన కేసు విషయంలో సత్తెనపల్లి రూరల్ పోలీసు స్టేషన్‌కు రావాలని పోలీసులు కోటి స్వాములుకు ఫోన్ చేశారు. పోలీసు స్టేషన్‌కు వచ్చిన కోటి స్వాములును స్టేషన్ బయట గండ్లూరు గ్రామానికి చెందిన పెద్ద మనుషులు శేషయ్య, వెంకట్రావు దూషించడంతో మనస్తాపం చెందిన కోటిస్వాములు పురుగు మందు తాగి మృతిచెందినట్లు మృతుని తల్లి మంగమ్మ విలపిస్తూ చెప్పింది. పురుగు మందు తాగిన కోటిస్వాములును హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 14న రాజుపాలెం మండలంలోని ఓకళాశాలలో చదువుతున్న కేరళ విద్యార్థిని(19) కళాశాల భవనం ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చేరిన ఆ విద్యార్థిని ప్రస్తుతం కోలుకుంటుంది. చదువు అబ్బడంలేదని, మొదటి సంవత్సరంలో నాలుగు సబ్జెక్టులు ఫెయిలయ్యాయనని, అందుకే చనిపోవాలనుకున్నానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
ఈనెల 16న నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జిట్టి అనూష కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థి పెన్ కనిపించకపోతే ఆ నెపం తనపై వేశారన్న బాధను తట్టుకోలేక క్షణికావేశంలో తనువు చాలించింది. ఈ ఘటన విద్యార్థుల్లో విషాదం నింపింది.
మేడికొండూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన ఒంటిపులి కోటి స్వాములు (35) భార్యతో నెలకొన్న మనస్పర్థల కారణంగా పెద్దమనుషులు దూషించారనే మనస్తాపంతో బుధవారం సత్తెనపల్లి రూరల్ పోలీసు స్టేషన్ ఎదుట పురుగుమందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సాక్షి, నరసరావుపేట : ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. చదవుల్లో ఒత్తిడి, ప్రేమలో వైఫల్యం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, దీర్ఘకాల అనారోగ్యం, బెట్టింగ్, ఒంటరితనం.. తదితర చిన్నచిన్న కారణాలకే ఎక్కవ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిని, క్షణికావేశంతో బలవన్మరణాలకు పూనుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమస్యను పంచుకుంటే వారితో చర్చిస్తే పరిష్కారాలు దొరుకుతాయి. అయినా ఒత్తిడికి గురై చావును స్వాగతిస్తున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, మానసిక ఒత్తిడి అధిగమించే విషయంలో అన్ని వర్గాల వారికి అవగాహన ఉండాలని, ఆత్మహత్య ఆలోచన వచ్చిన మొదటి దశలోనే గుర్తించి తగిన కౌన్సెలింగ్ ఇస్తే చాలామంది ఆ ఆలోచన నుంచి బయట పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మానసిక వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
పెరుగుతున్న భావోద్వేగ బలవన్మరణాలు
ఇటీవల కాలంలో భావోద్వేగ బలవన్మరణాలు పెరుగుతున్నాయి. తండ్రి కొట్టాడనో, భర్తతో గొడవపడో, భార్య పుట్టింటి నుంచి రాలేదనో తదితర చిన్న కారణాలతోనే చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పటి వరకు బాగున్న వారూ క్షణికావేశంతో ఈ తరహా నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీనికి ఉద్రేక మనస్తత్వమే కారణంగా మానసిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు యువత మత్తుపదార్థాలు, బెట్టింగ్ వంటి వ్యసనాలకు అలవాటుపడి సమస్యలను కొనితెచ్చుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడటం వల్ల తమ కుటుంబ సభ్యులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గుర్తించడం లేదు. దీని గురించి ఆలోచిస్తే ఆత్మహత్య ఆలోచన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
రోజురోజుకూ పెరుగుతున్న ఆత్మహత్యలు
గత వారంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలకు బలవన్మరణం భార్య కేసు పెట్టిందని సత్తెనపల్లి పోలీసు స్టేషన్ ఎదుట బుధవారం ఆత్మహత్య చేసుకున్న భర్త జూదంలో డబ్బులు పోగొట్టుకుని ఎంతోమంది తనువు చాలిస్తున్న వైనం సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదంటున్న మానసిక నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment