బాలికల ఆత్మహత్యాయత్నంపై సుమోటోగా విచారణ
సత్తెనపల్లి: ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థినుల ఘటనను సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి పేర్కొన్నారు. సత్తెనపల్లి వెంకటపతినగర్‌లోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని మంగళవారం రాత్రి ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పద్మావతి మాట్లాడుతూ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం ఘటనపై జిల్లా యంత్రాంగం రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థినులు వెల్లడించిన విషయాలు విని ఆమె ఆశ్చర్యపోయారు. 250 మంది విద్యార్థిను లకు ఒకే ఒక్క వాష్ రూము ఉందని, మిగిలినవి సెఫ్టిక్ ట్యాంకు నిండి నిరుపయోగంగా ఉండటం వల్ల దుర్గంధం వెదజల్లుతూ ఇబ్బందిగా ఉంటుందని, దానివల్ల కొంత మంది విద్యార్థినులు కళాశాలకు వెళ్లిన తరువాత కాలకృత్యాలు తీర్చుకుంటున్నారని, మరుగుదొడ్డి ఒకటే ఉండటం వల్ల కొంత మంది రెండు రోజులకొకసారి స్నానం చేస్తున్నామని విద్యార్థినులు పద్మావతి ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ రికార్డులు సక్రమంగా లేకపోవడం, స్టాక్ రిజిస్టరు సరిగా నిర్వహించకపోవడం, కనీసం మెనూ చార్ట్ కూడా ప్రదర్శించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. హాస్టల్ పరిసరాల్లో పందులు, కుక్కలు సంచరిస్తున్నాయని, నాసిరకం కూరగాయలతో ఆహారపదార్థాలు తయారు చేస్తున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. హాస్టల్లో విద్యార్థులతో కమిటీలు లేకపోవడం సరికాదన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పద్మావతి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణతో మాట్లాడి విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. హాస్టళ్లలో నెలలో ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ఆరోగ్య సూత్రాలు తెలియజేయాలన్నారు. బాలల హక్కుల కమిషన్ విద్యా ర్థినుల ఆత్మహత్యాయత్నం ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆహార పదార్థాలను ఆమె పరిశీలించారు. ఆమెతోపాటు పట్టణ సీఐ బ్రహ్మయ్య, ఎస్‌ఐ సత్యారాణి, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, బాలల పరిరక్షణ కౌన్సిలర్ శ్రీనివాసరావు, ఏఎస్‌డబ్ల్యూ నిరీక్షణ కుమారి, ఐసీడీఎస్ సత్తెనపల్లి ప్రాజెక్టు సీడీపీఓ టి.శ్రీలత, సూపర్‌వైజర్ ప్రమీల ఉన్నారు.
జిల్లా యంత్రాంగం రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆదేశం పద్మావతి ఎదుట నిజాలు వెల్లడించిన విద్యార్థినులు
Comments
Please login to add a commentAdd a comment