తండ్రీకొడుకుల మధ్య ఎస్పీ సయోధ్య
యడ్లపాడు: తండ్రీకొడుకుల మధ్య దశాబ్దకాలంగా నెలకొన్న తగవులకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిష్కారం చూపారు. ఇద్దరి మధ్య గ్రామపెద్దల సమక్షంలో బుధవారం సయోధ్య కుదిర్చారు. వివరాల్లోకి వెళితే.. యడ్లపాడు దిగువ ఎస్సీకాలనీకి చెందిన ఎడ్లూరి వెంకట్రావు, ఆయన కుమారుడు నాగరాజుల మధ్య కుటుంబ కలహాలు దశాబ్ద కాలంగా ఉన్నాయి. కొడుకు దురుసు ప్రవర్తనపై పలుమార్లు వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టునూ ఆశ్రయించాడు. చివరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈనెల 18న జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెళ్లి ఎస్పీకి విన్నవించాడు. దీంతో ఎస్పీ కంచి శ్రీనివాసరావు విచారణ నిమిత్తం బుధవారం వెంకట్రావు గృహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తాను, భార్య, కొడుకు, కోడలు, మనుమలంతా కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నామని, కొడుకు వల్లే గతంలో తాను అప్పులపాలైనట్లు అధికారులకు విన్నవించాడు. తనకు కూడు పెట్టకపోగా, ఆస్తి ఇవ్వాలంటూ తనపై దాడి చేస్తూ ఇంటి నుంచి గెంటివేసే యత్నం చేస్తున్నాడంటూ చెప్పాడు. 2022లోనే యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌లో నాగరాజుపై కేసు నమోదైన విషయాన్ని ఎస్పీకి గుర్తు చేశాడు. నాన్న మద్యానికి బానిసై అప్పులు చేశాడని, తాను కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి వెనుక ఖాళీ స్థలం ఇవ్వడానికి నిరాకరిస్తూ తనపై ఆరోపణలు చేస్తున్నాడంటూ నాగరాజు ఎస్పీకి వివరించాడు. దీంతో ఎస్పీ నాగరాజును సున్నితంగా మందలించారు. తల్లిదండ్రులపై ఆరోపణలు తగవని సూచించారు. తండ్రిపై దాడి నేరమని, ఇకపై ఇలాంటివి చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తండ్రీకొడుకుల మధ్య సయోధ్య కుదిర్చారు. తండ్రిని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటానని, ఆలనాపాలనా చూసుకుంటానని గ్రామపెద్దల సమక్షంలో నాగరాజును ఎస్పీ ఒప్పించారు. నాగరాజు ఇల్లు నిర్మించుకునేందుకు సహకరించాలని సూచించారు. ఓ సామాన్య వ్యక్తి కుటుంబ సమస్యపై చొరవ చూపి పరిష్కరించిన ఎస్పీని గ్రామపెద్దలు అభినందించారు. ఎస్పీ వెంట చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్‌ఐ వి.బాలకృష్ణ ఉన్నారు.
దశాబ్దకాలంగా సాగుతున్న
తగవులకు పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment