339 పరుగులు చేసిన ఉత్తరప్రదేశ్
మంగళగిరి: నగర పరిధిలోని అమరావతి టౌన్‌షిప్‌లో కల ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టు 339 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర జట్టు బౌలర్లు ఎన్.రాజేష్ 5, బి.యశ్వంత్ 3 వికెట్లు తీసి రాణించారు. 126 ఓవర్లలో 339 పరుగులకు ఉత్తరప్రదేశ్ జట్టు ఆలౌటైంది. అనంతరం గురువారం బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర క్రికెట్ జట్టు 42.01 ఓవర్లులో 100 పరుగులకు కుప్పకూలింది. బ్యాటర్ తరుణ్ సాత్విక్ 32 పరుగులు చేశాడు. ఉత్తరప్రదేశ్ బౌలర్ దేవాన్ష్ చతుర్వేది మూడు వికెట్లు తీశాడు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.
డాక్టర్ యశోదరకు షారోన్ అంతర్జాతీయ అవార్డు
తెనాలి: పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ పెన్నీ మినిస్ట్రీస్ ఏటా అందజేస్తున్న షారోన్ అంతర్జాతీయ అవార్డుకు తెనాలి వైద్యురాలు డాక్టర్ యశోదర పువ్వాడను జ్యూరీ ఎంపిక చేసింది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి గురువారం వెల్లడించారు. కెనడాకు చెందిన డాక్టర్ షారోన్ జ్ఞాపకార్థం ఈ అవార్డు అందజేస్తున్నట్టు తెలిపారు. గతేడాది డీ3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారదకు బహూకరించినట్లు ప్రదీప్ చెప్పారు. డాక్టర్ యశోదర తండ్రి డాక్టర్ సోమశేఖర్ తెనాలిలో పిల్లల వైద్యనిపుణులు కాగా, ఆమె భర్త డాక్టర్ కృష్ణసందీప్ తెనాలిలోని మైత్రి హాస్పిటల్ వ్యవస్థాపకుల్లో ఒకరు.
నిధులు దారి మళ్లించిన ఉద్యోగిపై కేసు
పట్నంబజారు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన నిధులను దారి మళ్లించిన ఉద్యోగిపై గురువారం కేసు నమోదైంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేసే సిరిల్‌పాల్ రూ. 17 లక్షలు నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారు. అధికారుల విచారణలో ఈ విషయం తేలడంతో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా సిరిల్‌పాల్‌పై ఇదే తరహా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ గోపీలాల్
పెదకాకాని: పెదకాకాని గ్రామానికి చెందిన గోపీలాల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020లో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన కారణంగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ముందుగా అతడిని పెదకాకాని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం పొన్నూరు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
టీడీపీ కార్యకర్తకు దేహశుద్ధి
మంగళగిరి: రత్నాల చెరువులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ కార్యకర్తకు దేహశుద్ధి చేసిన ఘటన చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు గురువారం తెలిపిన వివరాల మేరకు.. టీడీపీ కార్యకర్త గోలి రామాంజనేయులు రత్నాల చెరువులోని మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు నిలదీయడంతో ఒంటిపై దుస్తులు తీసేసి బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద హల్‌చల్ చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. వారు రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆడిట్ కమిషనరేట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు
లక్ష్మీపురం: దేశంలోని 48 సి.జి.ఎస్.టి. ఆడిట్ కమిషనరేట్‌లలో గుంటూరు కమిషనరేట్‌కు యాన్యూవల్ కంపోజిట్ గ్రేడింగ్‌లో 2023–24 ఆర్థిక ఏడాదికి ప్రథమ స్థానం దక్కింది. ఈ మేరకు ఢిల్లీలోని సి.జి.ఎస్.టి ఆడిట్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం గురువారం వివరాలు వెల్లడించింది. వంద మార్కులకు గుంటూరు కార్యాలయం అత్యధికంగా 73.22 సాధించింది. ఇందుకు కారణమైన అధికారులకు ఆ శాఖ చీఫ్ కమిషనర్ సంజయ్ రాతీ, కమిషనర్ పి.ఆనంద్ కుమార్‌లు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment