రహదారుల అభివృద్ధికి చర్యలు
నరసరావుపేట రూరల్: ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పెట్లూరివారిపాలెం–కోటప్పకొండ రహదారిలో చేపడుతున్న రహదారి మరమ్మతు పనులను మంత్రి జనార్దన్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. కోటప్పకొండకు చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న రోడ్లు మరమ్మతు పనులపై ఆర్‌అండ్‌బీ ఈఈ రాజానాయక్‌తో మంత్రి సమీక్షించారు. అనంతరం కోటప్పకొండ రోడ్ల మరమ్మతు పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో 1,737 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులు ఉండగా 383 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని చెప్పారు. రాజుపాలెం–బెల్లంకొండ రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తున్నట్టు తెలిపారు. నాబార్డు నిధులతో రూ.142 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కృష్ణానదిపై మాదిపాడు వద్ద రూ.60.54 కోట్లతో నాబార్డు నిధులతో చేపట్టనున్న బ్రిడ్జి పనులకు టెండర్ ప్రక్రియ పూర్తిచేసినట్టు వివరించారు. జిల్లాలో 935 కిలోమీటర్ల రోడ్లకు రూ.38 కోట్లతో 133 మరమ్మతు పనులను చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డీవో మధులత, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment