వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టి వేధింపులు
నరసరావుపేట: ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నాయకులను కేసులు పెట్టి వేధిస్తోందని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. న్యాయస్థానాల్లో కొట్టివేసిన కేసుల్లోనూ నేరం ఒప్పుకోవాలని పోలీసులు వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం, కర్లకుంట గ్రామాల్లో జరిగిన రెండు ఘటనల గురించి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ సూరజ్ గనోరే దృష్టికి తీసుకెళ్లి గోపిరెడ్డి వినతిపత్రం సమర్పించారు. అనంతరం గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో 2019లో ఆ ఊరి శ్మశాన వాటిక ప్రహరీ, ఆర్చ్‌లను వైఎస్సార్ సీపీ నాయకులు రాజనాల నాగిరెడ్డి, వెంకటరెడ్డి ధ్వంసం చేశారని అప్పటి మాజీ సర్పంచ్ కోర్టులో కేసు వేశారని, విచారణ అనంతరం వీరిద్దరూ నిర్దోషులుగా కోర్టు తేల్చిందని, అయితే ఇప్పుడు రాజనాల నాగిరెడ్డిని పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి నేరం ఒప్పుకోవాలని బెదిరిస్తున్నారని వివరించారు. కర్లకుంట గ్రామంలో దారపనేని అక్కయ్య గత ప్రభుత్వ హయాంలో సచివాలయ నిర్మాణం చేశాని, దాని తాలూకు బిల్లు పెండింగ్లో ఉండగా రెండు నెలల క్రితం రూ.2.79 లక్షల చెక్కు పంచాయతీ ఖాతాకు జమైందని, ఆ చెక్కుకోసం రెండు నెలల నుంచి అడుగుతుంటే సర్పంచ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, పంచాయతీ కార్యదర్శిపై కూటమి నేతలు ఒత్తిడి తీసుకొచ్చి చెక్కు ఇవ్వకుండా వేధిస్తున్నారని గోపిరెడ్డి ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికలు సమీపిస్తున్నా నరసరావుపేట, రొంపిచర్ల మండలాల తహసీల్దార్లు ఓటర్ జాబితాలు ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ విషయాలన్నీ జేసీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రొంపిచర్ల మండల కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట మండల కన్వీనర్ పచ్చవ రవీంద్రబాబు, నాయకులు పడాల చక్రారెడ్డి, పొనుగోటి వెంకటరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment