మన ‘దీక్ష’.. మెరిసింది!
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కొంచెం ఊహ వచ్చిన తర్వాత పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం కాలక్రమేణా తగ్గిపోతుంది. అందుకే వారు స్నేహితులపైనా, సెల్‌ఫోన్స్‌లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై ఎక్కువ ఆధారపడుతుండడం మనం తరచూ చూస్తుంటాం. పిల్లలకు విషయాలు తెలుస్తున్న సమయంలో వారితో ఎక్కువ టైం గడిపితే వారిలోని అభిరుచులు, అలవాట్లు తెలుసుకునే వీలుంటుంది. ఇదే చేశారు ఎస్‌వీఎన్ కాలనీకి చెందిన కాట్రగడ్డ శేషసాయి, హేమ ప్రభ దంపతులు. తమ ఒక్కగానొక్క కుమార్తె దీక్షను చిన్న వయస్సులోనే క్రికెట్ ఆటలో చేర్పించి మార్గదర్శకులుగా మారారు. అందుకే దీక్ష కేవలం 13 సంవత్సరాల వయస్సులోనే బీసీసీఐ అండర్–15 బాలికల క్రికెట్‌లో సత్తా చాటి ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో కీలక భూమిక పోషించింది. ఓపెన్ బ్యాటర్‌గానూ, వికెట్ కీపర్‌గానూ రాణించింది.
కన్నవారి ప్రోత్సాహంతో..
దీక్ష తండ్రి శేషసాయి ఒకప్పుడు క్రికెటర్. దీక్షకూ క్రికెట్‌పై మక్కువ ఏర్పడింది. ఆమెకు ఆట నేర్పడంతో దీక్ష అండర్–13 జిల్లా, జోనల్ క్రికెట్‌లో రాణించింది. గత నెలలో జరిగిన బీసీసీఐ అండర్–15 బాలికల టోర్నీకి ఆంధ్ర జట్టుకు ఎంపికైంది. కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఆ టోర్నీలో ఆంధ్ర జట్టు విజేతగా నిలిచింది. దీంతో నేరుగా ఆంధ్ర జట్టుకు బీసీసీఐ తదుపరి టోర్నీకి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. దీక్ష బ్యాటర్‌గానూ, కీపర్‌గానూ రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. మంగళవారం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దీక్షను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment