కోడి పోరు.. జన హోరు
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రధానమైన కోడిపోరు మంగళవారం జరిగింది. తెల్లవారు జామున వీరుల గుడిలో పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ, వీరాచారులు కోడిపోరును ప్రదర్శించారు. ముందుగా వీర విద్యావంతులు కోడిపోరు కథాగానం చేశారు. అలనాడు బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మల మధ్య జరిగిన కోడిపోరు తీరును వర్ణించారు. కథాగానం మధ్యనే పీఠాధిపతి చెన్నకేశవ బ్రహ్మనాయుడు పుంజు చిట్టిమల్లును, వీరాచార యువతి నాయకురాలు పుంజు శివంగిడేగను పోటీకి వదిలారు. తొలి రెండు పందేలలో బ్రహ్మనాయుడు పుంజు చేతిలో నాగమ్మ శివంగిడేగ ఓడిందని ప్రకటించారు. అనంతరం మలి పందేనికి నాయకురాలు ఉసికొల్పుతుందని, మాచర్ల, గురజాల రాజులు మలిదేవుడు, నలగామరాజులూ సై అంటారని వీరవిద్యావంతులు వివరించారు. ఓడినవారు రాజ్యం వదలి ఏడేళ్లు అరణ్యవాసం చేయాలనే షరతుతో ఈ మలి పందెం జరుగుతుందని, ఆ పందెంలో నాయకురాలు మాయోపాయంతో గెలుస్తుందని, పందేలకు అలరాజు న్యాయనిర్ణేతగా వ్యవహరించారని కథకులు పేర్కొన్నారు. బ్రహ్మనాయుడు పందెంలో ఓడారని అలరాజు ప్రకటించడంతో మలిదేవరాజు పరివారం ఏడేళ్లు అరణ్యవాసానికి తరలారని పేర్కొన్నారు.
వేడుకగా కోడిపోరు
ఆ తర్వాత కోడిపోరును వేడుకగా ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేలు నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి బ్రహ్మనాయుడు పుంజుతో, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నాయకురాలు పుంజుతో పందేలు వేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వీరుల దీవెనలందుకున్న ప్రజలు
ఇదిలా ఉంటే కోడిపోరు నాడు ప్రజలు భారీగా తరలివచ్చి వీరుల గుడిలో పల్నాటి వీరుల ఆయుధాలను దర్శించుకున్నారు. గ్రామోత్సవానికి వచ్చిన వీరుల ఆయుధాల ఆశీస్సులను ప్రజలు పొందారు. చిన్నారులకూ వీరుల దీవెనలందించారు. ఇదిలా ఉంటే వీరాచారులు పొంగళ్లు చేసుకుని తమ తమ కొణతాలతో ఊరేగింపుగా తరలివెళ్లి చెన్నకేశవస్వామికి అంకాలమ్మకు భారీగా బోనాలు సమర్పించారు. వీరాచారులు చాలా మంది గంగధారి మడుగు ఒడ్డున తలనీలాలు సమర్పించారు. చాలా మంది ఆచారవంతులు ఈ రోజు కూడా రణక్షేత్రానికి తరలివచ్చి తమ ఆచారాన్ని నెరవేర్చుకున్నారు. ఎక్కడ చూసినా కోడి పుంజులు, గొర్రె పొట్టేళ్లు కనిపించాయి. మధ్యాహ్నం వర్షం పడడంతో వీరాచారులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం జరగనున్న కళ్లిపాడు ఘట్టంతో ఐదు రోజుల ఉత్సవాలు ముగియనున్నాయి. పల్నాటి వీరుల ఆయుధాలు ఉదయం గ్రామోత్సవం ముగించుకుని ప్రజల ఆశీస్సులు పొంది సాయంత్రం నాగులేరు ఒడ్డున అలంకారాలు తీసివేసి కళ్లిపోతురాజు మండపం వద్ద కళ్లికి ఓరగడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
రణక్షేత్రంలో ఉత్సాహం కొనసాగుతున్న వీరారాధన ఉత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యేలు బ్రహ్మానందరెడ్డి, వెలిగండ్ల రాము
Comments
Please login to add a commentAdd a comment