ఫిరంగిపురంలో 17.8 మి.మీ. వర్షపాతం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా ఫిరంగిపురం మండలంలో 17.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.2 మి.మీ. పడింది. సగటు 5.2 మి.మీ.గా నమోదైంది. మండలాలవారీగా ప్రత్తిపాడులో 16.4, కాకుమాను 15.4, పొన్నూరు 9.6, గుంటూరు పశ్చిమ 9.4, గుంటూరు తూర్పు 8.2, పెదనందిపాడు 7.4, చేబ్రోలు 5.2, మేడికొండూరు 2.2, పెదకాకాని మండలంలో 1.6 మి.మీ. చొప్పున వర్షపాతం కురిసింది.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద మంగళవారం 1,902 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 150 , తూర్పు కెనాల్‌కు 45 , పశ్చిమ కెనాల్‌కు 80, నిజాంపట్నం కాలువకు 278 , కొమ్మమూరు కాలువకు 1293 క్యూసెక్కులు వదిలారు.
యార్డుకు 42,929 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 42,929 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 40,893 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 16,300 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 7,500 నుంచి రూ. 14,500 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 7,500 నుంచి రూ. 16,500 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 39,454 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
నేడు నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం
బాపట్ల: వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం బుధవారం బాపట్లలో నిర్వహిస్తునట్లు జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక కోన చాంబర్‌లో ఈ సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు. జిల్లా కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.
వెట్టి చాకిరి నుంచి కార్మికులకు విముక్తి
నగరంపాలెం: ఊరు కాని ఊరు.. తెలియని భాషతో వెట్టిచాకిరి చేస్తున్న వలస కార్మికులు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ చొరవతో ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. క్షేమంగా గుంటూరు చేరిన వారు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో మంగళవారం జిల్లా ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలలు క్రితం గుంటూరు నగరంలోని శివనాగరాజు కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, మిర్చియార్డు ప్రాంతాల్లోని పది మందికిపైగా కార్మికులు తాపీ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఆ పనులు ముగిశాక మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని గెవ్రాయ్ గ్రామం చేరుకున్నారు. అక్కడ యజమాని డ్రైనేజీ పనులు చేయిస్తున్నాడు. తగిన వసతి కల్పించకుండా అర్ధాకలితో పనులు చేయించాడు. పారిపోయేందుకు ప్రయత్నించే వారిని కొట్టేవారు. ఎట్టకేలకు వారిలో ఒకరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో జిల్లా ఎస్పీ దృష్టికి విషయం చేరింది. నగరంపాలెం పీఎస్ ఎస్‌ఐ బాషా బృందం బాధితులను తీసుకొచ్చింది. రూ.93 వేల వేతనాన్ని కూడా యాజమాని నుంచి ఇప్పించారు. నగరంపాలెం పీఎస్ ఎస్‌ఐ బాషా, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment