7న ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్–టీచర్స్ మీటింగ్
నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా ఈనెల ఏడున అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయాలకు అతీతంగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం)నిర్వహించాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ విషయంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నిర్వహించే కార్యక్రమానికి పూర్వవిద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, దాతలను ఆహ్వానించాలన్నారు. ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం కనిపించాలన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా సమావేశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కేవలం ఆహ్వానితులుగా మాత్రమే హాజరవుతారన్నారు. పాఠశాల ఆవరణంలో ప్రజాప్రతినిధుల బ్యానర్లు, ఎటువంటి రాజకీయ ప్రసంగాలకు తావులేదనే విషయం ప్రజాప్రతినిధులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డులు అందించాలని, వారి తల్లిదండ్రులకు తప్పనిసరిగా పిల్లల ప్రోగ్రెస్ గురించి వివరించాలన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాలు, సలహాలు నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవిని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య సంబంధ విషయాలపై తల్లిదండ్రుల సందేహాలకు సమాధానాలు ఇవ్వాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సమయానికి సమావేశం ముగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, మండల స్పెషల్ ఆఫీసర్లు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment