కొనుగోళ్లు నాస్తి!
కోతలు పూర్తి..
కూటమి ప్రభుత్వ పాలనలో అన్నదాతలకు కన్నీరే మిగులుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించాలంటే నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నేడు కనిపిస్తోంది. రైతు సేవా కేంద్రాలలో విక్రయించాలని భావిస్తే ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. 17 శాతం దాటిన తేమ, నల్ల గింజ, మొలకెత్తిన గింజలు పేరిట ప్రైవేట్ వ్యాపారులు దోచుకుంటున్నారు. వారు నిర్ణయించిందే ధర అవుతోంది. తేమ శాతం ఎక్కువన్న సాకుతో అడిగినన్ని కేజీలు ఇవ్వాల్సి వస్తోంది.
సాక్షి, నరసరావుపేట: ఖరీఫ్ సాగులో భాగంగా పల్నాడు జిల్లాలో 34,396 హెక్టార్లలో వరి పంటను రైతులు సాగు చేశారు. జిల్లాలో 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. 334 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం దిగుబడి భారీగా ఉండటం, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ పెరగడంతో రైతులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. కొనుగోళ్ల లక్ష్యం పెంచమని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 5 వేల మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,518 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. ఇందులో కూడా మిల్లర్లు, వ్యాపారుల నుంచి అధికారులు కొనుగోలు చేసిన ధాన్యమే అధికంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రభుత్వానికి మద్దతు ధరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ‘ఏ’ గ్రేడు రకం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయడం వల్ల రైతులు మద్దతు ధర పొందలేకపోతున్నారు. ‘పాయ ఉండకూడదు, నల్లగింజ రాకూడదు, రంగు మారకూడదు, మానుకాయ లాంటివి తగలకూడదు. ఇక తేమ శాతం 17 లోపు ఉండాలనే’ ప్రభుత్వ నిబంధనలు ఆటంకంగా ఉన్నాయి. ఆరబెడితే తేమ శాతం తగ్గించే వీలుంది. మిగతావన్నీ రైతుల చేతుల్లో ఉండవు. గిట్టుబాటు ధర కల్పించడానికి నిబంధనల్లో కొన్నింటికి మినహాయింపు ఇవ్వాల్సిందే. ఏ, బీ, సీ, డీ గ్రేడులు పెట్టి వాటికి ధరలు నిర్ణయించి కొనుగోలు చేయాలనే సూచనలు వ్యక్తం అవుతున్నాయి.
తక్కువ ధరకే విక్రయం
ఖరీఫ్‌లో ధాన్యం ఎక్కువగా బస్తా రూ.1,400లోపే రైతులు అమ్ముకున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా వారు నిర్దేశించుకున్న లక్ష్యాలకు, వచ్చిన దిగుబడులకు చాలా వ్యత్యాసం ఉంది. దిగుబడుల్లో కనీసం 25 శాతం అయినా ప్రభుత్వం కొనగలిగితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఆర్‌బీకే కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగాయి. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అవి ఎక్కడ ఉన్నాయో కూడా రైతులకు అర్థం కాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ బస్తా రూ.1,600–రూ.1,800 వరకు ధాన్యం కోసిన వెంటనే కొనుగోలు చేశారు. పక్క రాష్ట్రం వ్యాపారులను ఇక్కడకు రాకుండా కట్టడి చేసిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. దీంతో స్థానిక వ్యాపారులు నిర్ణయించిందే ధరగా మారింది.
జిల్లాలో ఖరీఫ్ సాగు 34,396 హెక్టార్లు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు లక్ష్యం కేవలం 5 వేల మెట్రిక్ టన్నులే ఇప్పటివరకు కొనుగోలు చేసింది 3,518 టన్నులు మాత్రమే ఇందులో అధికభాగం వ్యాపారులు, మిల్లర్ల నుంచే కొనుగోలు ప్రత్యామ్నాయం లేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్న అన్నదాతలు 75 కిలోల బస్తా కేవలం రూ.1,400కే కొంటున్న వ్యాపారులు తేమ శాతం, నాణ్యత వంటి సర్కారు నిబంధనలే రైతులకు శాపాలు
కూటమి సర్కారు నిర్లక్ష్యంతో అన్నదాతలకు కన్నీళ్లు
15 రోజులుగా కల్లంలోనే ధాన్యం
15 రోజులపాటు కల్లంలోనే ధాన్యం ఉంచా. వ్యాపారులు కొనడానికి రాలేదు. బస్తా రూ.1,200కు అడిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వాళ్లు వచ్చి చూసి తేమ ఉందని, అక్కడక్కడ పాయ తగులుతోందని పేర్కొన్నారు. తాము కొనలేమని చెప్పారు. తర్వాత పక్క ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారులు రూ.1,400కు కొన్నారు. నాలా చాలా మంది ఉన్నారు. ధాన్యానికి నాణ్యతను బట్టి ప్రభుత్వం రేటు నిర్ణయించి కొనుగోలు చేయాలి. ప్రతి గ్రామంలో దీనికి ఓ కేంద్రం ఉండాలి.
– షేక్ ఖాసిం, రైతు, కారెంపూడి
నాణ్యత తగ్గినా ధాన్యం కొనాలి
రెండు ఎకరాలలో వరి సాగు చేశా. పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయిద్దామని చూస్తే తేమ 17 శాతం కన్నా ఎక్కువ ఉందంటూ వెనక్కి పంపారు. ప్రభుత్వం కేవలం గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అలా కాకుండా తేమ శాతం 17 కన్నా ఎక్కువ ఉన్న వాటిని కొంత ధర తగ్గించి అయినా కొనుగోలు చేయాలి. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. నిబంధనలు సడలించి వారిని ఆదుకోవాలి.
– కొనతం మల్లారెడ్డి, రైతు, నకరికల్లు
Comments
Please login to add a commentAdd a comment