మంగళాద్రి ముస్తాబు
ముక్కోటికి
రేపు స్వామి ఉత్తర ద్వార దర్శనం
మంగళగిరి (తాడేపల్లి రూరల్): మంగళగిరిలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఏకాదశి రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచే స్వామి దేవేరుల సమేతంగా బంగారు గరుడ వాహనంపై ఉత్తరద్వారంద్వారా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. దీనికోసం ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక క్యూలైన్లు అందుబాటులోకి తెచ్చారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఏకాదశి ఒక్కరోజునే సుమారు లక్ష మంది భక్తులు స్వామిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
దక్షిణావృత శంఖం
వైకుంఠ ఏకాదశి రోజున దక్షిణావృత శంఖంతో భక్తులకు తీర్థం అందించడం ఆనవాయితీగా వస్తోంది. 1820లో తంజావూరు మహారాజు వారణాసి యాత్రలో భాగంగా మార్గమధ్యలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని బంగారు తొడుగు గల దక్షిణావృత శంఖాన్ని సమర్పించారు. అప్పటి నుంచి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున ఈ శంఖంతో లక్ష్మీనరసింహస్వామికి అభిషేకం చేస్తారు. అనతరం ఆ శంఖం ద్వారానే భక్తులకు తీర్థం అందిస్తారు. ఈ శంఖం నుంచి నిత్యం ఓంకార నాదం వినిపిస్తుంటుందని చెబుతారు.
నేడు, రేపు ఉత్సవాలు
మంగళాద్రి క్షేత్రంలో ఈ నెల 9,10వ తేదీల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 9వ తేదీ జాగరణ సందర్భంగా భజనలు, అన్నమయ్య సంకీర్తనలు, పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువారం స్వామిని జగన్మోహిని రూపంలో అలంకరించి పుష్పక విమానంపై ఊరేగిస్తారు. అర్ధరాత్రి దాటిన తరువాత తిరుమంజన ఉత్సవం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10న వేకువ జామున 4 గంటల నుంచి స్వామి ఉత్తర ద్వార దర్శనభాగ్యం కల్పిస్తారు. మధ్యాహ్నం స్వామి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. భక్తుల రద్దీని పురస్కరించుకుని ఈ ఏడాది దక్షిణావృత శంఖ తీర్థాన్ని 9, 10వ తేదీలలో ఇవ్వనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
ముక్కోటి సందర్భంగా ఉత్సవ, భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ బుధవారం ఆలయ ఈఓ రామకోటిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ, రూరల్ సీఐలు వినోద్‌కుమార్, శ్రీనివాసరావు, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బంగారు శంఖుతో తీర్థం వేలాదిగా తరలిరానున్న భక్తులు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఏర్పాట్లు పూర్తి
భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. పిల్లలకు, వృద్ధులకు క్యూలైన్లు ఏర్పాటు చేశాం. బాలలకు బిస్కెట్లు, మజ్జిగ, తాగునీరు అందిస్తాం. సుమారుగా లక్ష మందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నాం. – రామకోటిరెడ్డి,
ఆలయ కార్యనిర్వహణాధికారి
Comments
Please login to add a commentAdd a comment