ఆర్‌ఎస్‌కేల ద్వారా ధాన్యం కొనుగోలు
నరసరావుపేట రూరల్: రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి తెలిపారు. మండలంలోని పాలపాడు గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఏవో.. గ్రామంలోని మొక్కజొన్న పంటను పరిశీలించారు. అనంతరం రైతు సేవా కేంద్రంలో అన్నదాతలతో సమావేశం నిర్వహించారు. రైతు సేవా కేంద్రం ద్వారా ఎరువులను సరఫరా చేయాలని, ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. దీనిపై డీఏవో మాట్లాడుతూ అవసరాన్ని బట్టి ఎరువులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాలో ఐదు వేలకుగాను, ఇప్పటికే 3,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. మరో ఐదు వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వ అనుమతి కోరామని వివరించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణపై దృష్టి సారించాలని తెలిపారు. గొంగళి పురుగు ముఖంపై తిరగబడిన ఆకారంలో తెల్లని చారలను కత్తెర పురుగు కలిగి ఉంటుందని తెలిపారు. ఈ పురుగు నివారణకు ఎకరానికి లీటరు 1500 పీపీఎం వేపనూనె, 10,000 పీపీఎం వేపనూనె శాతం 200ఎంఎల్ పిచికారి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీటీసీ డీడీఏ ఎం.శివకుమారి, ఏడీఏ పి.మస్తానమ్మ, ఏవో నరేంద్రబాబు, డీసీ చైర్మన్ పులిమి రామిరెడ్డి, వీఏఏ ఎం.బోస్, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment