మిర్చికి ధర లభించేలా చూడాలి
కొరిటెపాడు(గుంటూరు): మిర్చి రైతులకు ఆశించిన ధర లభించేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత స్పష్టం చేశారు. గుంటూరు చుట్టుగుంటలోని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కార్యాలయం సమావేశ మందిరంలో మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో శుక్రవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం సీజన్ ప్రారంభం నుంచి మిర్చి ధరలు ఎందుకు పతనం అవుతున్నాయో ఎగుమతి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు వెలగపూడి సాంబశివరావు, తోట రామకృష్ణ, కొత్తూరి సుధాకర్, పి.నరేంద్ర, కె.వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో రైతులకు లభిస్తున్న ధరలు నిలకడగా ఉన్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే చైనా, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలకు ఎగుమతులు ఆశాజనకంగా లేవని తెలిపారు. ప్రస్తుతం శీతల గిడ్డంగులలో ఉన్న మిర్చి నిల్వలు ఎగుమతికి అనుకూలంగా లేవని పేర్కొన్నారు. దీంతో ధరలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదని వెల్లడించారు. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత పంట దిగుబడులు, మిర్చి ఎగుమతులపై ఒక అంచనా వస్తుందని, అప్పటి వరకు మిర్చి ధరలు నిలకడగా ఉంటాయని వివరించారు. ఫిబ్రవరి 15 తర్వాత చైనా దేశం నుంచి ఎక్స్‌పోర్టర్స్ రావచ్చని, అప్పుడు ధరల్లో మార్పు రావచ్చని సూచించారు. ఇంతకన్నా మిర్చికి మార్కెట్ రాదని వారు స్పష్టం చేశారు. కమిషనర్ విజయ సునీత మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.94 లక్షల హెక్టార్లలో మిరప పంట సాగు చేయగా 11.29 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. గుంటూరు మిర్చి యార్డుకు మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా రైతులు సరకు తెచ్చే అవకాశం ఉన్నందున గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి సహకరించాలని ఎగుమతి వ్యాపారులకు సూచించారు. మిర్చి సీజన్ ప్రారంభమైనందున గుంటూరు మార్కెట్ యార్డుకు అధిక సంఖ్యలో బస్తాలు వస్తున్నందున అసౌకర్యం కలగకుండా చూడాలని యార్డు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత తదుపరి సమావేశం ఉంటుందని వెల్లడించారు. మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు, విజిలెన్స్ జేడీ రాజశేఖర్, ఏడీఎం బి.రాజబాబు, మిర్చి యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక, వ్యాపారులు పాల్గొన్నారు.
మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత వ్యాపారులు, అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment