పలకరింపుతో సరి
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి..ఇక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి పర్యటించినట్లు చెప్పిన ఆయన.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏమిటో పరిశీలించకుండానే, తూతూమంత్రంగా పర్యటన ముగించుకుని వెళ్లిపోయారు. అధికారులు కూడా ఆయన షెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వకుండా.. గజిబిజి చేసేసి, ఎప్పుడు ఎటువైపు తీసుకెళ్తున్నారో తెలియక గందరగోళానికి గురి చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం జోగింపేటలో గల కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు. అక్కడి నుంచి వెంకంపేటలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఆస్పత్రిని సందర్శించినా రోగులతో కానీ, సహాయకులతోగానీ మాట్లాడి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వారిని పలకరిస్తూ..ముందుకు సాగిపోయారు. లోపల వార్డుల సందర్శన సమయంలోనూ కొంతమంది మీడియా ప్రతినిధులకే అనుమతినిచ్చి, మిగిలిన వారికి ఆంక్షలు పెట్టారు. అనంతరం అక్కడే వైద్యులతో కాసేపు సమీక్ష నిర్వహించి, కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పాలకొండ రక్తనిధి కేంద్రం శిలాఫలకాన్ని ప్రారంభించి..పర్యటన ముగించారు. ఆయన పర్యటన ఆద్యంతం స్థానిక కూటమి నాయకులు, రెండు జిల్లాల బీజేపీ నాయకులు, కార్యకర్తల హడావిడే కనిపించింది.
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద మీడియాతో మంత్రి మాట్లాడారు. జిల్లాలో వైద్యసేవలు ఎలా అందుతున్నాయి? మౌలిక సదుపాయాల కల్పన..ఇతర అవసరాలు, వైద్యసిబ్బంది, తగిన సంఖ్యలో మందుల సరఫరా జరుగుతోందా? కొరతలేంటి? పేదలు, గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయా? రిఫరెన్స్‌లు కేజీహెచ్‌కు పంపుతున్నారా? బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతోందా? పేదలు పూర్తి సంతృప్తికరంగా తిరిగి వెళ్తున్నారా? అనే విషయాలను పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు. ఇంత ప్రతికూల పరిస్థితిలో, ఏజెన్సీ ప్రాంతంలో, భౌగోళిక పరిస్థితులను తట్టుకుని మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న వైద్యసిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కొరత ఉన్నట్లు గుర్తించామని వివరించారు. ఫీడర్ అంబులెన్స్‌లు పని చేయకపోతే ఇటీవలే బాగు చేసి వినియోగంలోకి తెచ్చామని చెప్పారు. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వారు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే తిరిగి మృతదేహాలను తీసుకువెళ్లడానికి మహాప్రస్థానం లాంటి వాహనాలు లేని పరిస్థితి ఉందన్నారు. పార్వతీపురం ఆస్పత్రిలో 150 పడకలైతే..దాదాపు 300 వరకు ఐపీ నిత్యం ఉంటోందని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో తప్పుడు నిర్ణయాలతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. సాలూరులో ఏరియా ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే మౌలిక సదుపాయాల కల్పన జరగలేదని, కురుపాం, భద్రగిరిలో కూడా ఇదే పరిస్థితి అన్నారు. సీతంపేటలో వంద పడకల ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు వచ్చినా, సిబ్బందిని ఇచ్చినా మౌలిక సదుపాయాలు లేవన్నారు. అక్కడ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఉందని ఈ సమస్యలన్నింటినీ సరి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలోనే అప్‌గ్రేడ్ అయిన అన్నిచోట్లా సిబ్బందిని మంజూరు చేసి, ఇతర సౌకర్యాలు కల్పించి గిరిజనులు, పేదలకు మంచి వైద్యసదుపాయాలు అందిస్తామని చెప్పారు. మల్టీ స్పెషాలిటీ బ్లాక్‌ను కూడా త్వరితగతిన పూర్తి చేసి 250 నుంచి 300 పడకలు అదనంగా కల్పిస్తామని తెలిపారు. మూడో ఫేజ్‌లో ఇక్కడి వైద్య కళాశాల ఉందని.. ఆ మేరకు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్వతీపురంతోపాటు..ఏఎస్‌ఆర్ జిల్లాలో వైద్యకళాశాల సేవలు అవసరమని, రాష్ట్రంలో ప్రారంభించాల్సి ఉన్న 12 వైద్యకళాశాలలపై ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షించారని..అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు త్వరతిగతిన కల్పించి మెరుగైన వైద్యవిద్యను పేదలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
తూతూమంత్రంగా వైద్యశాఖ మంత్రి జిల్లా పర్యటన
ఆస్పత్రిలో రోగులతో మాటామంతి
జిల్లాకు స్పష్టమైన హామీ కరువు
Comments
Please login to add a commentAdd a comment