ఆగని ఘీం‘కరి’ంపు
పార్వతీపురం టౌన్:
జిల్లాలోగజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనావాసాల మధ్య సంచరిస్తూ. స్థానికులను బెంటేలెత్తిస్తున్నాయి. యథేచ్ఛగా పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల దాడి కారణంగా ప్రాణనష్టం కూడా సంభవిస్తున్న నేపథ్యంలో ‘మన్యంజిల్లా’ ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా గజరాజులు సంచరిస్తున్న గ్రామాల్లో ఒంటరిగా బయటకు వెళ్లలేకపోతున్నారు. పొలాలకు వెళ్లేదుకు కూడా రైతులు సాహసించడం లేదు. ఇటీవల పార్వతీపురం మండలంలో ఓ వృద్ధుడు గజరాజులకు చిక్కి విగతజీవిగా మారిన సంగతి తెలిసిందే. శనివారం రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటోపై ఏనుగులు దాడి చేశాయి. ఆదివారం నర్సిపురం గ్రామ సమీపంలో 5 ఎకరాల కొబ్బరి తోటను ధ్వంసం చేశాయి. ఇప్పటికే ఏనుగుల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 13కు చేరింది. రానున్న రోజుల్లో మృతుల సంఖ్య మరింత పెరగక ముందే తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో ఏనుగుల సంచారం ఇలా...
జిల్లాలో ప్రస్తుతం పార్వతీపురం మండలం హెచ్ కారాడవలస పరిసరాల్లో ఏడు, భామిని మండలం శివ్వాం కొండల ప్రాంతాల్లో మరో నాలుగు ఏనుగులు సంచరిస్తున్నాయి. నాగావళి నదీతీరం దాటుకుని గరుగుబిల్లి, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలన మండలాల్లోనూ ఆ ఏడు ఏనుగులు సంచరిస్తుండడంతో ఈ ప్రాంతవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకప్పుడు తోటలు, పంట పొలాల్లో సంచరించే గజరాజులు ప్రస్తుతం రహదారులు, జనావాసాల్లో తిరుగుతుండడంతో హడలెత్తిపోతు న్నారు. అవి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే వాటి వల్ల ఏటా పంటలను నష్టపోతున్న రైతులు ప్రాణనష్టం సంభవించకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రకటనకే పరిమితమైన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కుంకి ఏనుగులను రప్పించి, మన్యంలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ రెండుసార్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించారు. పార్వతీపురం మన్యం జిల్లాకు రెండు కుంకి ఏనుగులను దసరా పండుగలోపు తీసుకువస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమని బాధిత గ్రామస్తులు, బాధిత కుంటుబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే
స్పందించాలి
ప్రభుత్వం తక్షణమే స్పందించి, కర్ణాటక రాష్ట్రం నుంచి కుంకి ఏనుగులను రప్పించి, మన్యం జిల్లాలో రెండు జట్లుగా సంచరిస్తూ బీభత్సం చేస్తున్న ఏనుగులను అడవికిగాని, సంరక్షణ కేంద్రాలకుగాని తరలించేలా చర్యలు తీసుకోవాలి. ఏనుగుల దాడిలో చనిపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే విధంగా తగు చర్యలు చేపట్టాలి.
–ఎం. కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
కొబ్బరి పంట ధ్వంసం
రూ.10 లక్షల ఆస్తి నష్టం
లబోదిబో మంటున్న బాధిత రైతులు
ఆందోళనలో జిల్లా ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment