నేడు గ్రీవెన్స్ సెల్ రద్దు
పార్వతీపురం: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎల్‌సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున కార్యక్రమం నిర్వహించడం లేదని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. దూరప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి గ్రీవెన్స్‌సెల్‌కు ప్రజలు రావద్దని విజ్ఞప్తి చేశారు.
మెళియాపుట్టిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు
సీతంపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం మెళియాపుట్టిలో నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలపై గ్రీవెన్స్ సెల్‌లో విన్నవించుకోగలరని సూచించారు.
108లో ప్రసవం
సీతంపేట: మండలంలోని గోరపాడుకు చెందిన బి.జానకి 108 అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డను ఆదివారం ప్రసవించింది.గారపాడుకు చెందిన జానకికి పురిటినొప్పులు తీవ్రంగా ఉన్నాయన్న సమాచారం ఆశ వర్కర్ ద్వారా అందుకున్న 108 అంబులెన్స్ గారపాడు గ్రామానికి చేరుకుంది. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో సీతంపేట తీసుకవెళ్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో ఈఎంటీ రాములు, పైలట్ రామారావులు ఆశ వర్కర్ సహయంతో డెలివరీ చేశారు. అనంతరం తల్లీబిడ్డలను సీతంపేట ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. 108 సిబ్బంది చొరవను కుటుంబసభ్యులు అభినందించారు.
పర్యాటక ప్రదేశాల సందర్శన
సీతంపేట: మండలంలోని పర్యాటక ప్రదేశాలను ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆదివారం సందర్శించారు. పర్యాటకంగా ఇంకా ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలోనని పరిశీలించారు. అనంతరం సున్నపుగెడ్డ జలపాతాన్ని సందర్శించి అక్కడ టూరిజం పరంగా ఏ పనులకు ప్రతిపాదించాలో సమాలోచన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment