సాక్షి ప్రతినిధి, విజయనగరం:
నాలుక మడతపెట్టి నాలుగు అబద్ధాలు వల్లించడంలో, అవసరాన్ని బట్టి మాట మార్చేయడంలో గుమ్మడి సంధ్యారాణి కూడా టీడీపీ తానులో ముక్కేనని మరోసారి నిరూపించుకున్నారు. నాడు, నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంధ్ర ప్రధాన్‌తో కలిసి ఏడాది కిందట ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు గిరిజన యూనివర్సిటీ గురించి విమర్శనాత్మకంగా మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా గిరిజన యూనివర్సిటీని కొత్తవలస మండలంలోని రెల్లికి మళ్లీ తీసుకెళ్లాలనే విఫల ప్రయత్నాలు చేశారు. తీరా అక్కడ తలబొప్పి కట్టేసరికి సంధ్యారాణికి మళ్లీ గిరిజన ప్రాంతం గుర్తొచ్చింది. శుక్రవారం సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలోని కుంటినవలసలో నిర్వహించిన గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. ‘సాలూరు నియోజకవర్గ నాయకురాలివై ఉండి ఇక్కడి నుంచి గిరిజన యూనివర్సిటీని వేరే ప్రాంతానికి తరలించేయడం ఎంతవరకూ న్యాయమమ్మా?’ అని కుంటినవలస గ్రామస్తులు ప్రశ్నించేసరికి బిత్తరపోవడం సంధ్యారాణి వంతు అయ్యింది. తమాయించుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గిరిజన యూనివర్సిటీ మెంటాడలోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద సంధ్యారాణికి ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయ్యిందని ప్రజల్లో చర్చ జరుగుతోంది.
‘రియల్’ ప్రయత్నాలు తేలిపోయినట్లే...
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం ఉమ్మడి విజయనగరం జిల్లాకు దక్కిన ఏకై క సంస్థ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం. నాడు అధికారంలోనున్న చంద్రబాబు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ప్రచారపత్రాల్లో వాడుకొని తమ స్థిరాస్తి వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి తప్ప గిరిజనులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని విధంగా శృంగవరపుకోట నియోకవర్గం కొత్తవలస మండలం రెల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
చట్టం ప్రకారం గిరిజనుల చెంతన యూనివర్సిటీ ఉండాలన్న నిబంధనలను సైతం తుంగలోకి తొక్కి గిరిజనేతర నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ తప్పులను సరిదిద్ధి చట్టం ఆశించిన ప్రయోజనాలను గిరిజనులకు అందించాలనే సదుద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎస్టీ రిజర్వుడ్ సాలూరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సువిశాలమైనచోట 561.88 ఎకరాలను కేటాయించింది. మెంటాడ మండలంలోని కుంటినవలస వద్ద గత ఏడాది ఆగస్టు 25న కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో కలిసి నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. భవనాల నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభించడానికి వీలుగా రూ.23.60 కోట్లు మౌలిక వసతుల కల్పన పనులకు మంజూరుచేసింది. ఇప్పుడా పనులన్నీ కొలిక్కివచ్చాయి.
తరలింపు ప్రయత్నాలపై దెబ్బ...
దాదాపు రూ.31.91 కోట్లతో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ పాలకవర్గానికి స్థలాన్ని స్వాధీనం చేసింది. ఈ స్థలం అనువైందని గత ఏడాదే కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇక భవనాలను నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రజాపనుల విభాగానిది. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలో కొత్తవలస మండలంలో రెల్లి వద్ద యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడే కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. కనీసం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా హాజరుకాలేదు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవి తెచ్చుకున్న సుజయ్ కృష్ణ రంగారావుతో మమ అనిపించేశారు. కానీ చట్టం ప్రకారం అన్నివిధాలా అనుకూలమైన స్థలాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంపిక చేస్తే గుమ్మడి సంధ్యారాణి సహా టీడీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తదితర టీడీపీ నాయకులు గిరిజన వర్సిటీని మళ్లీ రెల్లికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. ఇటీవల చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ పరిశీలనకు వచ్చినప్పుడు ఆమె స్వయంగా కలిసిమరీ అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించారంటూ ఆమె అనుచరులు కొత్తవలసలో పండుగ చేసుకున్నారు. అప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కనీసం స్పందించలేదు. తమ నియోజకవర్గం నుంచి గిరిజన వర్సిటీ తరలిపోనివ్వనని ప్రకటన కూడా చేయలేదు. మౌనం వహించారు. ఈ తరలింపు సహేతుకం కాదని ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చింది. మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సహా పలువురు గిరిజన నాయకులు టీడీపీ నాయకుల ప్రయత్నాలను ఖండించారు. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా తరలింపునకు ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో గుమ్మడి సంధ్యారాణి మాట మార్చేయక తప్పలేదు.
మెంటాడ మండలంలోనే గిరిజన విశ్వవిద్యాలయం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్ణయానికే తప్పక మద్దతు
రెల్లికి మళ్లీ తీసుకెళ్లాలన్న టీడీపీ నాయకుల విఫల ప్రయత్నాలు
స్థలమార్పిడి వద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పేయడంతో తలబొప్పి
కేంద్ర నిర్ణయాన్నీ విమర్శిస్తూ గతంలో సంధ్యారాణి ప్రకటనలు
ఇప్పుడు గ్రామ సభల్లో రైతులకు మద్దతుగా సన్నాయినొక్కులు
Comments
Please login to add a commentAdd a comment