27 తులాల బంగారం చోరీ
● కేసు నమోదు చేసిన పోలీసులు
రాజాం సిటీ: రాజాం మున్సిపాల్టీ పరిధి పాలకొండ రోడ్డులో పొనుగుటివలస లక్ష్మీనగర్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ మేరకు సంతకవిటి ఎస్సై ఆర్.గోపాలరావు సోమవారం తెలిపిన వివరాల మేరకు లక్ష్మీనగర్ అపార్ట్‌మెంట్‌కు చెందిన విశ్రాంత వీఆర్వో సలాది శేషగిరి తన మూడో కుమార్తె వివాహం నిమిత్తం కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 2న ఏలూరు వెళ్లారు. ఆదివారం ఉదయం అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ శేషగిరి ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి ఇంటి యజమానికి ఫోన్‌చేశాడు. అక్కడినుంచి బయలుదేరి సోమవారం ఇంటికి చేరుకున్న శేషగిరి ఇంటి తాళాలు పగలగొట్టి, ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండడాన్ని గమనించారు. ఇంట్లో బంగారు ఆభరణాలు లేకపోవడంతో దొంగలు పడ్డారని గుర్తించి సంతకవిటి పోలీసులకు సమాచారం అందించారు. ఏడు తులాల బంగారు హారాలు రెండు, ఐదు తులాల గాజులు, రెండు తులాల నల్లపూసలు, నాలుగు తులాల బంగారు నెక్లెస్‌లు 3, రెండు తులాల బ్రాస్‌లెట్స్ 2, తులం బంగారు చైను, తులం బంగారు బాల్ గొలుసు ఒకటి, ఒకటిన్నర తులం మరో చైన్, ఒకటిన్నర తులం నెక్లెస్ ఒకటి, రెండు తులాల పది జతల చెవిదిద్దులు మొత్తం 27 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర. సిబ్బంది, క్లూస్‌టీమ్‌తో కలిసి వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment