చివరిలో తెగుళ్ల దాడి
● వరి పంటకు ఆశించిన రెల్లరాల్చు పురుగు
● వరి కంకులను విరిచేస్తున్న వైనం
● ఆందోళనలో రైతులు
● 1121, సోనామసూరి రకాలకు ఆశించిన పురుగు
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ వరి పంట చివర దశకు వచ్చేసింది. సీజన్‌లో వర్షాలు అనుకూలించి ప్రకృతి సహకరించిన ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల మరో వారం, పది రోజుల్లో పంట చేతికంది వస్తుందన్న దశలో వరి పంటకు పురుగు ఆశించడంతో దిగుబడులపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కంకులను పురుగు విరిచేస్తుండడంతో దిగుబడి పడిపోతుందని అన్నదాత దిగులు పడుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఏమి చేయాలో తోచడం లేదు.
1121, సోనామసూరిలకు ఆశించిన పురుగు
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వరి పంట 97 వేల హెక్టార్లలో సాగైంది. వీటిలో ఎక్కువగా రైతులు 1121 వరి రకాన్ని సాగు చేసారు. 80 వేల హెక్టార్ల వరకు 1121 రకం సాగవ్వగా మిగిలిన పొలంలో సోనామసూరి, సాంబమసూరి, స్వర్ణ తదితర రకాలను రైతులు సాగు చేసారు. వరి పంటకు ప్రస్తుతం రెల్లరాల్చు పురుగు ఆశించింది. ఈ పురుగు వరి పంట కంకులను విరిచేయడంతో ధాన్యం నేలపాలవుతున్నాయి.
దిగుబడిపై ఆందోళన
పంట చివరి దశలో రెల్ల రాల్చు పురుగు ఆశించడంతో కంకులు విరిగిపోతున్నాయి. దీని వల్ల దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ధాన్యం దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది పంటను బట్టి ఎకరానికి 26 నుంచి 28 బస్తాలు దిగుబడి వస్తుందని రైతులు భావించారు. అయితే పురుగు ఆశించడం వల్ల ఎకరానికి 15 నుంచి 18 బస్తాలకు మించి దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పురుగు మందు పిచికారీ
చేయడానికి వీల్లేని పరిస్థితి
వరి పంటకు వాశించిన పురుగు నివారణకు పురుగు మందు పిచికారీ చేయడానికి వీల్లేని పరిస్థితి. రెల్ల రాల్చు పురుగు నివారణకు పురుగు మందు పిచికారీ చేయాలంటే వరి కోతకు 10, 15 రోజులు సమయం ఉండాలి. కానీ జిల్లాలో చాలా చోట్ల వరి కోతలు కోయడానికి నాలుగైదు రోజులు సమయం మాత్రమే ఉంది. దీంతో పురుగు మందు పిచికారీ చేయడానికి వీలు కాని పరిస్థితి నెలకొంది.
క్షేత్ర స్థాయిలో పర్యటించని వ్యవసాయ సిబ్బంది
వ్యవసాయ సిబ్బంది రైతుల పొలాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పడం తప్పితే క్షేత్ర స్థాయిలో రైతులకు ఏ మేలు జరగడం లేదని చెబుతున్నారు. రెల్లరాల్చు పురుగు ఆశించడం వల్ల వరి కంకులు విరిగిపోయి రైతులకు నష్టం వాటిల్లుతున్నా వ్యవసాయ అధికారులు సూచనలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పురుగు ఆశించింది..
జిల్లాలో రెల్లరాల్చు పురుగు వరి పంటకు ఆశించిన మాట వాస్తవమే. రెల్లరాల్చు పురుగు ఆశించినట్టయితే క్లోరోఫైరిపాస్ మందు ఎకరానికి 500 ఎం.ఎల్ సాయింత్రం పూట వరి పంట బాగా తడిచేటట్టు పిచికారీ చేయాలి. వ్యవసాయ అధికారులు, సిబ్బందిని పొలాల్లో పర్యటించి పురుగు నివారణ చర్యలు గురించి తెలియజేయాలని ఆదేశించాం.
– వి.తారకరామరావు, జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment