మూడు నెలల వరకు పింఛన్ బకాయి చెల్లింపు
పార్వతీపురం: ఎన్‌టీఆర్ భరోసా పింఛను పథకం కింద మూడు నెలల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శుక్రవారం టెలి కాన్షరెన్స్ ఆయన నిర్వహించారు. పింఛను పంపిణీ వ్యవధిలో అందుబాటులో లేనివారు, పింఛను తీసుకోని పింఛనుదారులకు మూడు నెలల వరకు పింఛను బకాయిలు చెల్లించడం జరుగుతుందన్నారు. బకాయిల చెల్లింపు 2024 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి విడుదల అవుతుందని ఆయన వివరించారు. పింఛనుదారు ఏదైనా కారణం చేత పింఛను తీసుకోకపోతే, అది తాత్కాలిక వలసగా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. ఎవరైనా పింఛనుదారు ఒక నెలలో పింఛను (తాత్కాలిక వలస) తీసుకోకపోతే, ఒక నెల బకాయితో పాటు రెండవ నెల పింఛను విడుదల చేయడం జరుగుతుందని, పింఛనుదారులు రెండవ నెలలో కూడా పింఛను తీసుకోని పక్షంలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద పింఛనుదారులకు సౌకర్యాలు కల్పించేందుకు రెండు నెలల బకాయిలతో పాటు మూడవ నెల పింఛను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు. పింఛనుదారులు మూడు నెలలు వరుసగా పింఛను తీసుకోకపోతే శాశ్వత వలసగా పరిగణించి వారి పింఛను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత నిబంధనలపై పింఛనుదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పింఛను పంపిణీని పర్యవేక్షించాలని అన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment