మద్దతు కరువు..!
పత్తి
రైతుకు..
వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఏడాది దాదాపు 15 వేల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగుచేశారు. రికార్డుల్లో నమోదు కాని పంట మరో 15 వేల ఎకరాల్లో ఉండొచ్చని అంచనా. గిరిజనులు పోడు పంటలు, వివిధ పండ్ల తోటల్లోనూ అధిక మొత్తంలో సాగులో ఉంది. ఇవేవీ లెక్కల్లోకి రావ డం లేదు. కొన్నిచోట్ల కౌలుకు తీసుకుని రైతులు సాగుచేసిన పంట కూడా ఉంది. ప్రస్తుతం ప్రభు త్వం మద్దతు ధర పొడుగు పింజ క్వింటాకు రూ. 7,521, పొట్టి పింజకు రూ.7,121గా నిర్ణయించింది. పత్తి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల దళారులు సిండికేట్‌గా మారి, తమ ఇష్టానుసారంగా కొనుగోలు చేసి, రైతును దోచేస్తున్నారు. అప్పు లు చేసిన సాగుకు దిగిన రైతు.. మద్దతు ధర రాకపోవడంతో క్వింటా వద్ద సుమారు రూ.1,500 వరకు నష్టపోతున్నాడు.
ఎకరాకు పెట్టుబడి రూ.25 వేలకుపైగానే...
జిల్లాలో భామిని, కొమరాడ, సాలూరు, పాచిపెంట, మక్కువ, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మ లక్ష్మీపురం మండలాల్లో పత్తి ఎక్కువగా సాగులో ఉంది. ఎకరా విస్తీర్ణంలో సుమారు రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. నిరంతరం పంట సాగులో ఉండటం.. రసాయనిక ఎరువుల ప్రభావం వల్ల భూసారం తగ్గి ఆరేడు క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. ఓవైపు దిగుబడి పడిపోవడం.. మరోవైపు ప్రభుత్వ ఇస్తున్న మద్దతు ధర దక్కకపోవడంతో పత్తి పండించిన రైతుకు నష్టాలే మిగులుతున్నాయి.
రామభద్రపురంలో కొనుగోలు కేంద్రం
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈ ఏడాది రామభద్రపురం మండలం ముచ్చెర్లవలస వద్ద ఉన్న ప్రతూ జిన్నింగ్ మిల్లు వద్ద కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సుమారు 18 మండలాలకు ఈ కేంద్రమే ఆధారం. జిల్లాలోని పత్తి సాగు చేసే మండలాల్లో ఏ ప్రాంతం నుంచి వెళ్లాలన్నా.. వ్యయప్రయాసలే. ముఖ్యంగా భామిని పరిసర ప్రాంతాల నుంచి రావాలంటే.. దూరం 100 కిలోమీటర్లకుపైగానే పడుతుంది. అంత దూరం తీసుకుని వెళ్లడం.. తీరా అక్కడ తేమ ఉందన్న కారణంతో రెండేసి రోజులు ఆరబెట్టాల్సి రావడం వల్ల రైతు ఇబ్బందులు పడుతున్నాడు. పత్తి పంట తరలించడానికి అయ్యే రవాణా ఖర్చే రూ.12 వేలు వరకు అవుతోంది. రెండు క్వింటాళ్ల ధర ఇక్కడే పోతోంది. సాలూరు, భామినిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ.. ఆచరణలోకి రాలేదు. మరోవైపు నిబంధనలు గుదిబండగా మారుతున్నాయి. కనీస మద్దతు ధర రావాలంటే పత్తి గింజ పొడవు 29.50 మి.మీ నుంచి 30.50 మి.మీ వరకు ఉండాలి. మైక్రో నియర్ వ్యాల్యూ 3.5 నుంచి 4.3 వరకు ఉండాలి. తేమ శాతం 8 ఉంటేనే పూర్తి మద్దతు లభిస్తుంది. ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఉంటే.. ప్రతి ఒక్క శాతానికీ రూ.75.21 పైసలు చొప్పున ధరలో కోత ఉంటోంది.
విక్రయించలేక.. దాచుకోలేక!
ప్రస్తుతం పండిన పంట చేతికి వస్తోంది. ఈ నేపథ్యంలో పంటను దాచుకోవడానికి స్థలం లేక, ఇళ్లలోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పొరపాటున అగ్ని ప్రమాదాలు సంభవిస్తే పెద్ద నష్టమే చవిచూడాల్సి వస్తుంది. దీనికితోడు వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల కూడా పత్తి నాణ్యత కోల్పోవాల్సి వస్తోంది. భామిని మండలంలో సుమారు 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల సదుపాయం ఉంది. దీనిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి. రైతుల నిస్సహాయ స్థితిని చూసి దళారులు ప్రవేశిస్తున్నారు. రామభద్రపురంలోని జిన్మింగ్ మిల్లు యాజమాన్యమే తమ ఏజెంట్ల ద్వారా నేరుగా గ్రామాల్లోకి వెళ్లి రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తేమ, ధూళి, రాళ్లను సాకుగా చూపి క్వింటా రూ.6,100 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన రైతు క్వింటా దగ్గర రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నాడు.
గిట్టుబాటుకాని పంట
అందుబాటులో లేని కొనుగోలు కేంద్రం
రామభద్రపురం తీసుకెళ్లలేక
దళారులకే విక్రయం
క్వింటా వద్ద రూ.1500 వరకు నష్టం
నిస్సహాయ స్థితిలో రైతులు
కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతు నిస్సహాయ స్థితి లో దళారులు చెప్పిన ధర కు అమ్ముకోవాల్సిన పరిస్థి తి జిల్లాలో ఉంది. ఇప్పటికే పంట సాగుకు భారీగా అప్పులు చేశారు. ఇప్పుడు మద్దతు కూడా దక్కకపోతే రైతు పరిస్థితి ఏమిటి? భామిని, కొమరాడ, కురుపాం మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుకు మద్దతు ధర దక్కేలా చూడాలి. దీనిపై సంయుక్త కలెక్టర్ ను కలసి వినతిపత్రం అందజేశాం.
– బుడితి అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
Comments
Please login to add a commentAdd a comment