అవయవదాతా.. జోహార్..
పాపం తల్లిదండ్రులు
రోడ్డు ప్రమాదంలో పల్లవి తల్లిదండ్రులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇద్దరు కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కన్న బిడ్డను కడసారి చూసేందుకు కదల్లేని స్థితిలో అంబులెన్సులో స్ట్రెచర్‌పై మురపాక గ్రామానికి చేరుకున్నారు. విగత జీవిగా మారిన బిడ్డను చూసి కన్నీరుకార్చారు. అవయవదానానికి అంగీకరించిన పల్లవి తల్లిదండ్రుల పెద్దమనసును తిరుమల మెడికవర్ ఐసీయూ ఇన్‌చార్జి డాక్టర్ పి.ఎస్.వి.రామారావు అభినందించారు. ఇటీవల కాలంలో ప్రజల్లో అవయవ దానంపై అవగాహన పెరిగిందని తెలిపారు. వైద్యానికి సహకరించని పరిస్థితుల్లో అవయవదానం చేయడం వల్ల మరొకరికి పునర్జన్మనిచ్చినట్టు అవుతుందన్నారు.
విజయనగరం ఫోర్ట్: ఎంతో ఆనందంగా జీవిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తోటి స్నేహితులతో ఆడుతూపాడుతూ, చలాకీగా ఉండే చిన్నారి... విగతజీవిగా మారుతూనే.. మరో ఇద్దరికి అవయవదానం, నేత్రదానం చేసింది. పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకరించిన తల్లిదండ్రులను సభ్యసమాజం అభినందిస్తోంది. మరోవైపు విగతజీవిగా ఉన్న చిన్నారిని చూసిన వారంతా అయ్యో తల్లీ.. ఎంత కష్టం వచ్చిందంటూ ఆస్పత్రివద్ద కన్నీరుపెట్టారు.
గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ ఈ నెల 20న భార్య దేవి, కుమార్తె పల్లవి(11)తో కలిసి బైక్‌పై ఎగువ కొండపర్తిలోని వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో బైక్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్యాభర్తల చేతులు, కాళ్లకు గాయాలు కాగా, పల్లవి తలకు తీవ్రగాయమైంది. ఆమెను తొలుత ఎస్.కోట ఏరియా ఆస్పత్రి, అనంతరం విజయనగరంలోని తిరుమల మెడికవర్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పల్లవికి బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు. అవయవదానానికి తల్లిదండ్రులను ఒప్పించారు. పల్లవి శరీరం నుంచి సేకరించిన రెండు కిడ్నీలలో ఒకటి విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రికి, మరొకటి కిమ్స్ ఐకాన్‌కు తరలించి రోగులకు అమర్చారు. నేత్రాలను విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. అవయదానం అనంత రం పల్లవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రీన్‌ఛానల్ ద్వారా అంబులెన్సులో కిడ్నీలను తరలించే సమయంలో నర్సింగ్ విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది, గ్రామస్తులు పల్లవికి జోహార్లు పలికారు. ప్రాణదాతా.. జోహార్ అంటూ నినదించారు. చిన్నారి మృతదేహాన్ని తరలించే సమయంలో ఆస్పత్రి ప్రాంగణం వద్ద గ్రామస్తులు, బంధువులు బోరున విలపించారు.
తను మరణించి ఇద్దరికి ప్రాణదానం చేసిన చిన్నారి
అవయవదానానికి అంగీకరించిన
తల్లిదండ్రులకు అభినందనలు
సేకరించిన కిడ్నీలు విశాఖకు తరలింపు
పల్లవి మృతితో గ్రామంలో
విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment