డయల్ యువర్ డీఏహెచ్‌ఓకు 23 వినతులు
పార్వతీపురం టౌన్: డయల్ యువర్ డీఏహెచ్‌ఓకు 23 వినతులు అందాయని జిల్లా పశు సంవర్ధక అధికారి డా. శివ్వాల మన్మధరావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 9 గంటల నుంచి డయల్ యువర్ డీఏహెచ్‌ఓ(జిల్లా పశు సంవర్ధక అధికారి) కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో 23 మంది రైతులు వారి సమస్యలను తెలియజేశారన్నారు. ప్రభుత్వం అందజేసిన ఈఎంఆర్‌తో పాల దిగుబడి గణనీయంగా పెరిగిందని, సబ్సిడీతో కూడిన టీఎంఆర్ మిశ్రమ దాణాను ఏడాది మొత్తం సరఫరా చేయాలని పలువురు రైతులు కోరారు. పాచిపెంట మండలం చిన్నచీపురువలస నుంచి కొర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ తమకు 6 ఆవులు ఉన్నాయని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా గోకులం షెడ్ మంజూరు చేయాలని కోరారు. భామిని మండలం బాలేరు నుంచి విజయ్‌కి టీఎంఆర్ (సంపూర్ణ మిశ్రమ దాణా), మినరల్ మిక్సర్, ఏలిక పాములు నివారణ మందులు సరఫరా చేయాలని కోరారు. సీతానగరం, కాసయ్యపేట నుంచి శ్రీనివాసరావు, కొమరాడ, కేమిశిల నుంచి పట్లసింగు నారాయణరావు, బలిజిపేట మండలం పణుకువలస నుంచి మూడడ్ల సీతంనాయుడు, కాసయ్యపేట నుంచి తేలు యశోద పీఎంఈజీపీ ద్వారా పశువులు పెంపకం ఋణాన్ని మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. పలువురు రైతులు తమకు మినీ గోకులం షెడ్లు మంజూరు చేయాలని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా పశు గ్రాసం పెంచటానికి మంజూరు చేయాలని కోరారన్నారు. ఆయా రైతుల సమస్యలకు తగు పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందని, పశు సంవర్ధక సిబ్బంది రైతులతో నేరుగా కలసి పరిష్కార చర్యలు చేపడతామని జిల్లా పశు సంవర్ధక అధికారి రైతులకు వివరించారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు డా.కె ప్రసాదరావు, డా.శ్రీనివాసరావు, డా.బి.చక్రధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment