దళారులకే ధాన్యం
ప్రభుత్వ ‘భరోసా’ శూన్యం..
● వరి రైతులను పీకల్లోతు కష్టాల్లో ముంచేసిన కూటమి ప్రభుత్వం ● పలుచోట్ల వరి పంటకు ‘తుపాను’ ప్రభావంతో నష్టం ● నూర్చేసిన ధాన్యం తడవకుండా కాపాడుకోవడానికి అష్టకష్టాలు ● ధాన్యం తడిసినా కొంటామన్న భరోసా కరువు ● విధిలేని పరిస్థితుల్లో దళారులు చెప్పిన ధరకే అమ్మకం ● ధర, తూకం తేడాతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన ఆరునెలలు గడవకముందే రైతులకు చుక్కలు కనబడుతున్నా యి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో దూరదృష్టి తో, మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు అందించిన సేవల విలువేమిటో ఇప్పుడు తలచుకొని రైతులు బాధపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తడిచిపోతుంటే వారి కళ్లు చమర్చుతున్నాయి. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ముఖం చాటేస్తోంది. మొక్కుబడిగా అక్కడక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా అవేవీ ఇప్పుడు ఉపయోగపడట్లేదు. తడిసిన ధాన్యం మునుపటి ప్రభుత్వంలా కొంటామన్న భరోసా ఏదీ ఇవ్వట్లేదు. ఇక ఆలస్యం చేస్తే అన్నివిధాలా నష్టపోతామన్న భయంతో రైతులు తమ పంటను నష్టమైనా తక్కువ ధరకే దళారులకే విక్రయించేస్తున్నారు. ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని టీడీపీ కూటమి నాయకులు చేస్తున్న ప్రకటనలు ఆచరణలోకి రావట్లేదు.
పార్వతీపురం మన్యంలో తీవ్ర నష్టం..
పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపు 60 వేల మంది రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1,35.481 ఎకరాల్లో వరి సాగుచేశారు. దాదాపు 3,57,921 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 15 మండలాల్లో 183 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం. తుపాను ప్రభావంతో పలు మండలాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. సకాలంలో కొనుగోలు చేపట్టకపోడంతో రైతులు దళారులకు అమ్మేస్తున్నారు. వారు 82 కేజీల బస్తాకు రూ.1450 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో బస్తాపై దాదాపుగా రూ. 900 వరకు నష్టాన్ని రైతులు భరించాల్సిన పరిస్థితి.
రైతన్న నిలువునా దగా...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రైతు భరోసా పథకం ద్వారా ఇచ్చిన పెట్టుబడి సాయం రైతులకు ఎంతగానే ఉపయోగపడింది. దుక్కి పనులతో పాటు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు అక్కరకు వచ్చేది. అంతేకాదు దళారుల బారినపడకుండా ఆర్‌బీకేల ద్వారానే ధాన్యం కొనుగో లు కేంద్రాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసేది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఇవ్వడంతో రైతులకు కాస్త గిట్టుబాటు అయ్యేది. టీడీపీ కూటమి నాయకులు గత ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఆశలు రేపారు. కానీ ఇంతవరకూ పైసా కూడా ఖాతాలో వేయలేదు. దీంతో చాలామంది రైతులు మళ్లీ పూర్వంలాగే ధాన్యం వ్యాపారుల (దళారులు) వద్ద చేబదులు తీసుకొని పెట్టుబడులు పెట్టారు. మరి కొంతమంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 నుంచి రూ.5 వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. తీరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఆలస్యంగా అదీ అక్కడక్కడా తెరిచింది. అక్కడ సవాలక్ష ఇబ్బందులు పెడుతుండడంతో వేరే గత్యంతరం లేక దళారులకే, వారు చెప్పిన ధరకే రైతులు ధాన్యం విక్రయించేస్తున్నారు. ఇప్పటికే దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల వరకూ దళారులే కొనుగోలు చేసి, ఇతర జిల్లాలకు తరలించినట్టు సమాచారం. ఒక్క బొబ్బిలి ఏఎంసీ పరిధిలో ఉన్న బొబ్బిలి, రామభద్రపురం, పెరుమాళి తదితర చెక్‌పోస్టుల వద్ద రూ.2 సెస్సు ప్రకారం రూ.30.02 లక్షలను వసూలు చేశారంటే ధాన్యం రూ.30 కోట్లకుపైగా తరలిపోయినట్టులెక్క. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఎంసీల పరిధిలో మరెంత ధాన్యం తరలిపోయిందో అర్ధమవుతోంది.
● రైస్ మిల్లర్ల ప్రమేయాన్ని నియంత్రించే వ్యవస్థకు టీడీపీ కూటమి ప్రభుత్వం గండికొట్టేసింది. రైతుల కు మేలు చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేసిన ‘రైస్‌మిల్లుల ర్యాండమైజేషన్’ విధా నాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం తీసుకెళ్లవచ్చంటూ గొప్పలు చెప్పింది. కానీ ఈ నిర్ణయమే మళ్లీ దళారుల నెట్టిన పాలుపోసినట్టయింది.
గద్దల్లా వాలిపోతున్న దళారులు...
ఒకవైపు ముంచుకొచ్చిన ముసురు, మరోవైపు ప్రభుత్వం నుంచి కనీసం భరోసా దక్కకపోవడంతో నైరాశ్యంలోనున్న రైతులను దోచుకునేందుకు దళారులు గెద్దల్లా వాలిపోతున్నారు. తాము చెప్పిన ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి సాధారణ రకానికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2300 చొప్పున రావాలి. కానీ దళారులు క్వింటాకు రూ.1770 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇలా 50 క్వింటాళ్లు ధాన్యం విక్రయిస్తే రైతుకు రూ 26,400 వరకు నష్టం వాటిల్లుతోంది.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
తుపాను కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రంగుమారిన ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు కూడా కొనుగోలు చేయరు. అలాగైతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే తుపాను కారణంగా 30శాతం వరకు పంట నష్టపోయాం.
– బౌలాడ రామ్మూర్తి, కూర్మరాజుపేట, సాలూరు మండలం
ప్రభుత్వానికి ముందుచూపు లేదు..
ఆరుగాలం కష్టించిన రైతు పంట చేతికొచ్చే సమయంలో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రభుత్వానికి ముందుచూపు లేదు. డిసెంబర్ వచ్చేసినా కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాలేదు. దళారులకు అమ్మితే ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.23వేల వరకు నష్టం వస్తోంది.
– కన్నా ప్రసాదరావు, రైతు, రుద్రిపేట,
పాలకొండ మండలం
Comments
Please login to add a commentAdd a comment