పొలానికి వెళ్లి.. విగతజీవులుగా మారి..
జియ్యమ్మవలస: వారిది ఉమ్మడి కుటుంబం. వ్యవసాయమే జీవనాధారం. ఇంటిల్లిపాదీ ఆరుగాలం పొలంలో శ్రమిస్తూ కుటుంబాలను నెట్టుకువస్తున్నారు. ఇప్పుడు ఆ పొలంలోనే ఒక్కొక్కరుగా తనువుచాలిస్తుండడం కలవరపరుస్తోంది. ఐదేళ్ల కిందట పెద్దన్నయ్య కృష్ణ పొలంలోనే మృతి చెందగా.. ఇప్పుడు పొలానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వైకుంఠపు శ్రీను (45), సింహాచలం(43) ఎస్టీ మరువాడ వద్ద ఉన్న పొలంలో రబీ వరి పంట కోసం నారుమడి సిద్ధం చేసేందుకు శనివారం ఉదయం వెళ్లారు. ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యు లు ఫోన్‌చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. మోటారు వేసే సమయంలో సపోర్టు వైరుకు విద్యుత్ ప్రసరించడం, దానికి వారు తగలడంతో షాక్‌కు గురై మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. మృతుడు శ్రీను ఇద్దరు కుమారుల్లో చక్రధర్ ఎంసీఏ చేస్తుండగా వెంకటేష్ ఐటీఐ చదివి ప్రైవేటు ఉద్యోగంలో ఇటీవల చేరాడు. సింహాచలం పాప రమ్య డిగ్రీ చదువుతుండగా రమేష్ ఐటీఐ చదువుతున్నాడు. ఐదేళ్ల కిందట మృతిచెందిన కృష్ణకు ఇద్దరు అమ్మాయిలు ఉండగా వారికి పెళ్లళ్లు జరిగాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషా దం అలముకుంది. మృతుల తండ్రి మరణించగా తల్లి మహాలక్ష్మి ఉంది. ఇంటికి పెద్ద దిక్కును మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల భార్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసన్నకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
విద్యుత్ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు మృతి
శిఖబడి గ్రామంలో విషాదం
గతంలో వారి అన్నయ్య కూడా పొలంలోనే తనువుచాలించిన వైనం
Comments
Please login to add a commentAdd a comment