భయం భయంగా వైద్య సేవలు
బాలింతలకు వైద్యసేవలందిస్తున్న స్టాఫ్‌నర్స్ ఉష
రామభద్రపురం: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రాత్రి పూట వైద్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. కనీస భద్రత లేకుండా తాము వైద్యం చేయలేమంటూ సిబ్బంది తెగేసి చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేసే సిబ్బందికి భద్రత ఏర్పాట్లపై ఆ శాఖాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 24 గంటల స్థాయి కలిగిన ఈ ఆస్పత్రిలో రాత్రి పూట భద్రత లేనిదే వైద్యం చేయలేమని సిబ్బంది వాపోతున్నారు. అంతరరాష్ట్ర కూడలి అయిన మండలకేంద్రంలో జాతీయ రహదారి ఉండడంతో ఈ రహదారిలో ప్రమాదాలు జరుగుతుండం వల్ల బాధితులు ఆస్పత్రికి వస్తుంటారు.అలాగే స్థానికులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వారు, ఇతర ప్రాంతాలకు చెందిన రోగులు వైద్యం కోసం నిత్యం పదుల సంఖ్యలో ఆస్పత్రికి వస్తుంటారు. వారిలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. దీంతో రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న స్థానిక పీహెచ్‌సీలో పటిష్ట భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. పీహెచ్‌సీల్లో భద్రతా సిబ్బందిని నియమించకపోవడంతో కూటమి ప్రభుత్వంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి భద్రత సిబ్బందిని నియమించాలని వైద్యసిబ్బంది పక్షాన స్థానికులు కోరుతున్నారు.
ఇటీవల ఓ వ్యక్తి వీరంగం..
ఇటీవల డెలివరీ కోసం ఓ గర్భిణిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెతో పాటు కుటుంబసభ్యులు వచ్చారు.అందులో ఓ వ్యక్తి ఫుల్‌గా మద్యం తాగి ఆస్పత్రిలో డెలివరీ చేసిన స్టాఫ్‌నర్స్‌పై వీరంగం వేశాడు.నానా బూతులు తిట్టాడు, ఆమె భయపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆఖరికి పోలీసులు వచ్చి గట్టిగా గదమాయించిన తర్వాత వెళ్లిపోయాడు. ఈ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని, రాత్రి పూట వైద్యసేవలందించే స్టాఫ్‌నర్సులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాత్రి పూట భద్రత లేనిదే వైద్యం చేయలేమని వాపోతున్నారు.
ప్రభుత్వానికి విన్నవించాం..
24 గంటల స్థాయి కలిగిన స్థానిక పీహెచ్‌సీకి రాత్రుల్లో భద్రత కోసం సెక్యూరిటీ సిబ్బంది అవసరమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు విన్నవించాం. వారు పరిశీలన చేస్తున్నారు.ప్రస్తుతం సెక్యూరిటీ సిబ్బంది లేనిది చాలా ఇబ్బందికరంగా మారుతోంది. రాత్రివేళల్లో వైద్యసిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రాత్రి వేళల్లో తాము విధులకు రాలేమంటూ స్టాఫ్‌నర్స్‌లు తెగేసి చెబుతున్నారు. తమ ఇబ్బందులను జిల్లా అధికారులు గుర్తించి తక్షణమే సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని కోరుతున్నాం.
దిలీప్‌కుమార్, పీహెచ్‌సీ వైద్యాధికారి,రామభద్రపురం
భద్రతపై నిర్లక్ష్యమెందుకు?
స్థానిక పీహెచ్‌సీలో రాత్రివేళల్లో కచ్చితంగా వైద్య సిబ్బంది వైద్యం చేయాల్సిన పరిస్థితి. ఆస్పత్రి భవనం జాతీయ రహదారికి కొంత లోపలికి ఉంది. ఇక్కడ రాత్రి వేళల్లో ఒక మహిళా సాఫ్‌నర్స్, అటెండర్ మాత్రమే విధుల్లో ఉంటారు. వైద్యం కోసం వచ్చే వారిలో అత్యధికంగా మద్యం తాగిన వారే ఉంటారు. దీంతో వైద్యం కోసం వచ్చేవారు విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందిపై మద్యం మత్తులో దుర్భాషలాడుతున్నారు. ఆ సమయంలో ఏ జరుగుతుందోనని సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
రామభద్రపురం పీహెచ్‌సీలో
ప్రశ్నార్థకంగా రాత్రిపూట విధులు
సిబ్బందికి సెక్యూరిటీ సమస్య
పట్టించుకోని వైద్యారోగ్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment