క్యాన్సర్ ఆస్పత్రిని నాణ్యంగా నిర్వహించాలి
కొత్తవలస: ఒక సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిని నిర్వహించడం మాటలు కాదని, నూతనంగా ప్రారంభించిన డాక్టర్ విజయశ్రీ క్యాన్సర్ ఆస్పత్రిని అత్యంత నాణ్యంగా నిర్వహించాలని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. ఈ మేరకు కొత్తవలస మండలంలోని మంగళపాలెం గ్రామంలో శ్రీగురుదేవా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్(యుఎధ్వే)సాయంతో నూతనంగా నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రిని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ గురుదేవా ట్రస్టుకు తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.అమర్‌నాథ్ గౌడ్ మాట్లాడుతూ తన భార్య పేరుమీద ఉప్పలపాటి వెంకటపతిరాజు రూ.15కోట్లు పెట్టి క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించి పేదలకు బహుమతిగా ఇచ్చారని కొనియాడారు. సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషనర్ కేవీ చౌదరి మాట్లాడుతూ గురుదేవా చారిటబుల్ ట్రస్టు దివ్యాంగులకు సేవ అందించడమే కాకుండా వారికి జీవన భృతిని కూడా కల్పిస్తోందని ప్రశంసించారు.
భార్య జ్ఞాపకార్థం ఆస్పత్రి నిర్మాణం
డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్(యుఎన్‌ఏ) వ్యవస్థాపకుడు ఉప్పలపాటి వెంకటపతిరాజు మాట్లాడుతూ తన భార్య మృతి చెందిందని ఆమె పేరు మీద ఒక క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి రూ.15 కోట్లు వెచ్చించి గురుదేవా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కేవలం ఏడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశామన్నారు. గురుదేవా ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రి విజయశ్రీ ఆస్పత్రేనన్నారు. ఈ ఆస్పత్రిలో ఉచితంగా పేదప్రజలకు సేవలు అందజేస్తామన్నారు. అనంతరం మాట్లాడిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ముకుందశర్మ, ఎస్.కోట ఎమ్మె ల్యే కోళ్ల లలితకుమారి, స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారం ఎం.డి బండి సురేషకుమార్‌లు గురుదేవా చారిటబుల్ ట్రస్టు సేవలు, ఉప్పలపాటి వెంకటపతిరాజు ఔదార్యాన్ని కొనియాడారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇమంది శంకరరావు, గొంప కృష్ణ పాల్గొన్నారు.
విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్
Comments
Please login to add a commentAdd a comment