ప్రమాదాల నియంత్రణకు భద్రత చర్యలు
విజయనగరం క్రైమ్: రహదారి భద్రత ప్రమాణాల పట్ల అవగాహన, ఆచరణతోనే జిల్లాలో రహదారి ప్రమాదాలను నియంత్రించవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రహదారి ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వాహనదారులకు భద్రత పట్ల అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలని, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను, పెద్ద ప్రమాదాలు జరిగినప్పటికీ స్వల్పగాయాలతో ఎలా ప్రాణాలతో సుర క్షితంగా బయటపడవచ్చునో వాహనదారులకు వివరించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో గాలి, దుమ్ము నుంచి హెల్మెట్ రక్షించడంతో పాటు, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తాయన్నారు. ఊహించని రహదారి ప్రమాదాల నుంచి రక్షించే రక్షణరేఖ వంటిది హెల్మెట్ ధారణ అని తెలిపారు. ప్రతి వాహనదారు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో నాణ్యత కలిగిన సరిగ్గా అమర్చిన హెల్మెట్స్‌ను ధరించే విధంగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించని వారిపై ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 35,204 మందిపై ఎంవీ చలానాలను విధించామని పేర్కొన్నారు.
ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్
అధికారులు ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టి, ప్రజలకు, వాహనదారులకు రహదారి భద్రత, మోటారు వాహన చట్టం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించి, కేసులు నమోదుచేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై దాడులు చేపట్టి, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదుచేయాలని తెలిపారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద రహదారి ప్రమాదాలు జరగకుండా బ్లాక్‌స్పాట్స్‌కు ఇరువైపులా కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు, డ్రమ్ములు ఏర్పాటుచేసి, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించే విధంగా వాటిపై రేడియం స్టిక్కర్లు అతికించాలని అధికారులను ఆదేశించారు.
ఎస్పీ వకుల్ జిందాల్
Comments
Please login to add a commentAdd a comment