పర్యాటక డీఎంగా దివ్యాంగుల శాఖ జగదీష్
విజయనగరం అర్బన్: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ విశాఖ ప్రాంతీయ డివిజనల్ మేనేజర్‌గా విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్‌ల శాఖ సహాయ సంచాలకుడు జీవీ బీగజదీష్ నియమితులయ్యారు. పర్యాటక అభివృద్ధి సంస్థకు సంబంధించి ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించనున్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడిగా ఆయన జిల్లాలో దివ్యాంగుల కోసం అందించిన సేవలకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సహకారంతో మెగా శిబిరాలు నిర్వహించి జిల్లాలో ఒకేసారి 2,338 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.3.25 కోట్లు విలువ చేసే బ్యాటరీతో నడిచే మోటార్ సైకిల్స్, ఇతర ఉపకరణాలు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆయన అందించారు. విభిన్న ప్రతిభా వంతుల శాఖ ఎ.డిగా ఆయన స్థానంలో ఆ శాఖ అధికారులు ఇంకా ఎవరినీ నియమించలేదు.
సివిల్ సర్వీస్ ఉద్యోగుల కబడ్డీ పోటీలకు శంకరరావు ఎంపిక
నెల్లిమర్ల: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 3వతేదీ నుంచి ఆరు రోజుల పాటు జరగనున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల కబడ్డీ పోటీలకు నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన కాళ్ల శంకరరావు ఎంపికయ్యారు. మండలంలోని మొయిద గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శంకరరావు అఖిల భారత కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం ఇది మూడోసారి. ఈ పోటీల్లో శంకరరావు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల పోటీల్లో శంకరరావు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. శంకరరావు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్ బాబు), ఎంపీపీ అంబళ్ల సుధారాణి, మొయిద, పూతికపేట గ్రామాల సర్పంచ్‌లు అట్టాడ కృష్ణ, లెంక మంగమ్మ, ఎంపీటీసీ పెనుమత్స సంతోష్‌బాబు, పంచాయతీ కార్యదర్శి ఎన్. మోహనరావు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ బి.రామారావు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
250 మద్యం బాటిల్స్ పట్టివేత
మెరకముడిదాం: మండలంలోని భైరిపురం జంక్షన్ వద్ద శనివారం అర్ధరాత్రి బైక్‌పై 250 మద్యం బాటిల్స్ తరలిస్తుండగా విజయనగరానికి చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు, బుదరాయవలస పోలీసులు పట్టుకున్నారు. మద్యం బాటిల్స్‌ను తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడంతో పాటు వారి దగ్గర నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో హెచ్‌సీ అంజిబాబు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తకార్డులకు మోక్షమెప్పుడో...?
పార్వతీపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా ఇంతవరకు ఒక్కరికి కూడా కొత్త రేషన్‌కార్డు మంజూరు చేయలేదు. డిసెంబర్ మొదటి వారంలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగడంతో అర్హులైన వారు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకుండా దరఖాస్తులు స్వీకరించలేమని సిబ్బంది చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొంతమంది సచివాలయ సిబ్బంది దరఖాస్తులను స్వీకరిస్తున్నప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో సచివాయలంలోనే దరఖాస్తులు మూలనపడి ఉన్నాయి. కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయడంతోపాటు పాత కార్డులలో చేర్పులు మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో అర్హులకు భంగపాటు తప్పలేదు. కొత్త రేషన్‌కార్డులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేంతవరకు అర్హులు వేచి చూడాల్సిందే మరి.
Comments
Please login to add a commentAdd a comment