గిరిజన సంప్రదాయానికి ప్రతీక.. ‘కంది కొత్తలు’ పండగ
గుమ్మలక్ష్మీపురం: గిరిజనుల ఆచార సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే పండగల్లో ప్రధానమైన ‘కంది కొత్తల పండగ’కు వేళయింది. గిరిజన గూడల్లో పండగ డప్పు శుక్రవారం మోగనుంది. అన్ని వర్గాల ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే వినాయకచవితి, దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది తదితర పండగల తరహాలో మన్యం గిరిజనులు ఏటా డిసెంబర్‌నెలలో కంది కొత్తల పండగను వైభవంగా జరుపుకుంటారు. కొండపోడులో సాగుచేసిన కందులు, గంటెలు, జొన్నలు, రాగులు, కొర్రలు, వరి పంటను ముందుగా గిరిజన దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం గిరిజనులు ఆహారంగా స్వీకరిస్తారు. పండగ జరిగే వరకు పంట చేతికొచ్చినా ఆహారంగా తీసుకోరు. గిరిజన దేవతలకు నైవేద్యంగా సమర్పించాకే పంటలను ఆహారంగా వినియోగించే ఆనవాయితీని ప్రతీ గిరిజన కుటుంబం తూచా తప్పకుండా పాటిస్తుంది. పండగ ప్రారంభం రోజు అందరూ కొత్త బట్టలు ధరించి, మేళ తాళాలతో గ్రామ దేవతకు పూజలు చేస్తారు. మొక్కుబడులు చెల్లిస్తారు. తర్వాతి రోజు నుంచి గ్రామ దేవత ప్రతిరూపంగా కొలిచే గొడ్డలమ్మ(గొడ్డలి), ఛత్తరమ్మ(నెమలి పించాలు)లను గిరిజన గ్రామాల్లో ఊరేగిస్తూ ఆడా, మగా, చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఐకమత్యంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సంప్రదాయ రీతిలో థింసా నృత్యాలు చేస్తారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా గిరిజన గ్రామాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. తమ జీవితాలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ జన్నోడు/ దీసరోడు/ఎజ్జోడుగా పిలువబడే పూజరీల సూచనల మేరకు ఆయా గ్రామాల్లో వారం రోజుల పాటు ఈ పండగను నిర్వహిస్తారు. వీరి సూచనల మేరకే దేవతలుగా పిలుచుకునే గొడ్డలమ్మ, ఛత్తరమ్మలను గ్రామాల్లో ఊరేగించి, పూజలు చేసి, అనుపోత్సవం చేస్తారు. ఈ ఏడాది కూడా పండగను ఘనంగా నిర్వహించేందుకు గిరిజనులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న కంది కొత్తల పండగ
గిరిజన దేవతలకు పూజలు చేయనున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment