31న డీఎస్‌పీసీఏ సమావేశం
పార్వతీపురం టౌన్: జంతువులపై క్రూరత్వ నియంత్రణ కమిటీ సమావేశం ఈ నెల 31న నిర్వహిస్తామని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఎస్.మన్మథరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం 31న కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుందని, సంబంధిత అధికారులు, సభ్యులు హాజరుకావాలని కోరారు. గోశాల మంజూరు, నిర్మాణం, అక్రమ పశురవాణా, కోడి పందాల నివారణ, విద్యా సంస్థల్లో యానిమల్ కైండ్‌నెస్ క్లబ్స్ ఏర్పాటు, సామాజిక బాధ్యతతో జంతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తామన్నారు.
దివ్యాంగులకు
రాయితీపై పెట్రోల్
పార్వతీపురంటౌన్: మూడుచక్రాల మోటరైజ్డ్ వాహనం కలిగిన దివ్యాంగులకు రాయితీపై పెట్రోల్ సరఫరాకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిర్ణీత దరఖాస్తుఫారం పూర్తి చేసి దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు ఫోన్–08942–240519 నంబర్‌కు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలన్నారు.
ఆ పాదముద్రలు
పులివికావు.. పిల్లివి
సాలూరు రూరల్: మండలంలోని శివరాంపురం గ్రామంలో గురువారం కరిబుగత సత్యనారాయణ పొలంలో పులి అడుగులు ఉన్నట్టు కొందరు రైతులు అనుమానించారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. అవి పులి అడుగులు కావు ఫిషింగ్ క్యాట్ అడుగులుగా నిర్ధారించారు. ఇటీవల కాలంలో శివరాంపురం గ్రామ సమీపంలో వేగావతి నదిలో వేపుగా పెరిగిన గడ్డిలో కొన్ని దుప్పులు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వాటిని కాపాడాలని కోరుతున్నారు.
37వ రోజుకు చేరిన
గురువుల రిలే నిరాహార దీక్ష
సీతంపేట: గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఐటీడీఏ ముఽఖద్వారం వద్ద చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 37వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 2022 పీఆర్‌సీ ప్రకారం జీతాలు చెల్లించాలని, సీఆర్‌టీగా మార్పు చేయాలని కోరారు. తమ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బి.గణేష్, ఎస్.మోహన్‌రావు, బి.ధర్మారావు, కె.భవాని, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కులగణనపై సోషల్ ఆడిట్
పార్వతీపురం: జిల్లాలో ఎస్సీ కులగణనపై జనవరి 10వ తేదీ వరకు సోషల్ ఆడిట్ జరగనుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ జనాభా, వారి వివరాలు, పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయసు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం, ఇతర వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శన, డిసెంబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందన్నారు. జనవరి 10న కులగణన తుది వివరాలు పొందుపరుస్తామన్నారు. డేటాపై అభ్యంతరాలను వీఆర్‌ఓ స్వీకరిస్తారని, వీటిని మూడు దశల్లో తనిఖీ చేస్తారని తెలిపారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్‌ఓ పరిశీలించి వివరాలను సంబంధిత రెవెన్యూ అధికారికి నివేదిస్తారని ఆయన చెప్పారు. సోషల్ ఆడిట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత నియోజక వర్గ స్థాయి అధికారులను, జిల్లా అధికారులను నియమిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment