విషాదయాత్ర
పూసపాటిరేగ: తమిళనాడు రాష్ట్రం నుంచి వందల కిలోమీటర్లు దూరం కారులో ప్రయాణించారు. శ్రీకాకుళంలోని పుణ్యక్షేత్రాలను దర్శించారు. ఆ సంతోషంతో తిరుగు ప్రయాణమైన యాత్రికులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలస పెట్రోల్ బంకు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతిచెందగా, కొడుకు, కోడలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
తమిళనాడు రాష్ట్రం చైన్నె అరుణంబకం సంజీవనగర్‌కు చెందిన భార్యాభర్తలు యదుకుమార్ (85), శ్రీలీల (75)లు, వీరి కొడుకు అశోక్‌కుమార్, కోడలు ప్రసన్న కలిసి శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మనాథుడి దర్శనం కోసం కారులో వచ్చారు. శ్రీకూర్మ నాథుడు, అరసవల్లిలోని ఆదిత్యుని దర్శనం అనంత రం గురువారం తిరుగుప్రయాణమయ్యారు. అశోక్‌కుమార్ కారును నడుపుతున్నారు. విశాఖపట్నం వైపు వెళ్తుండగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలస పెట్రోల్ బంకు సమీపంలో ముందు వెళ్తున్న లారీని వెనుకనుంచి కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యదుకుమార్, శ్రీలీల అక్కడికక్కడే మృతి చెందారు. వారి కోడలు ప్రసన్న, డ్రైవింగ్ చేస్తున్న కుమారుడు అశోక్ కుమార్‌కు తీవ్రగాయాలయ్యా యి. సంఘటన జరిగిన వెంటనే భోగాపురం సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ సూర్యకుమారి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. గాయపడిన భార్యాభర్తలను చికిత్స నిమిత్తం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ కె.సూర్యకుమారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదాల జోరు
భోగాపురం–లింగాలవలస పెట్రోల్‌బంకు మధ్యలో నెలరోజులు వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో 10 మంది వరకు మృత్యువాత పడ్డారు. ప్రమాదాలకు అతి వేగమే కారణమని తెలుస్తోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు అదే ప్రదేశంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. వరుస ప్రమాదాలతో స్థానికులు హడలిపోతున్నారు.
పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చి భార్యాభర్తలు మృతి
ముందువెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టిన కారు
అందులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి
కొడుకు కోడలకు తీవ్రగాయాలు
Comments
Please login to add a commentAdd a comment