పాలకొండలో పోరుబాట
విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ పాలకొండ డివిజన్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. యాలాం కూడలి నుంచి ర్యాలీగా బయల్దేరిన కళావతి.. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ఆరు నెలల బాదుడు పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాన్య ప్రజలపై కరెంటు చార్జీల పిడుగు వేసిన కూటమి ప్రభుత్వం.. తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోగా, ఎవరూ వాటిపై ప్రస్తావించకుండా.. వరుసగా భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. చంద్రబాబు కాదని.. చంద్రబాదుడు అని ఎద్దేవా చేశారు. అబద్ధాలే ప్రచార అస్త్రంగా వంచిస్తున్న చంద్రబాబు అండ్ కోకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. ప్రస్తుతం ధాన్యం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ప్రభుత్వం ఎలానూ పట్టించుకోవడం లేదని.. కనీసం అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు పడుతున్న కష్టాలను చూడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో వరి, అపరాలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment