బాబును నమ్మితే వంచన గ్యారంటీ
‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ’ అని కల్లబొల్లి మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఆరు నెలల కాలంలోనే బాబును నమ్మితే వంచన గ్యారంటీ అని మరోమారు ప్రజలకు తెలిసొచ్చేలా చేశారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త పీడిక రాజన్నదొర అన్నారు. సామన్య, మధ్య తరగతి ప్రజలపై విద్యుత్ చార్జీల వడ్డన విధించడాన్ని నిరసిస్తూ సాలూరు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పట్టణం నుంచి వందలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో కలసి ర్యాలీగా విద్యుత్ శాఖ కార్యాలయానికి చేరుకుని, అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ.. చంద్రబాబువన్నీ అబద్ధపు హామీలేనని.. ఓట్లేసి గెలిపించిన ప్రజలను వంచించడం ఆయన నైజమని విమర్శించారు. ఎన్నికలకు ముందు పలు సందర్భాల్లో విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు.. ఆరు నెలలు తిరగకుండానే ప్రజలపై పెను భారం మోపుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల రాయితీ విద్యుత్‌కు కూడా మంగళం పాడేశారని.. రూ.వేలల్లో వస్తున్న బిల్లులను చూసి గిరిజనులు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క నవంబర్ నెలలోనే రూ.6,072 కోట్లు, డిసెంబర్‌లో రూ.9,412 కోట్లు కలిపి మొత్తంగా రూ.15,485 కోట్లు ప్రజల నెత్తిన భారం వేశారని వివరించారు. చంద్రబాబు వైఖరి దుర్మార్గమని, అత్యంత హేయమని అన్నారు. ప్రజలకు పథకాలు ఇవ్వకపోగా.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, తిరిగి వారి నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
q
Comments
Please login to add a commentAdd a comment