నెత్తురోడిన రోడ్లు
రహదారి భద్రతపై పోలీసులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ.. వాహనదారులు నిర్లక్ష్యం వీడడం లేదు. స్వయంగా జిల్లాకు చెందిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వాహన శ్రేణే ఈ ఆరు నెలల్లో రెండుసార్లు ప్రమాదానికి కారణం కావడం గమనార్హం. కొద్ది నెలల కిందట రామభద్రపురం వద్ద మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. గత నెలలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర వాహనాన్నే మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం సాలూరు మండలంలో ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో రాజన్నదొరకు త్రుటిలో ప్రమాదం తప్పింది.
● 2023లో రహదారి ప్రమాదాల్లో 275 కేసులు నమోదై.. 95 మంది మృతి చెందగా.. 2024లో 11 శాతం కేసుల సంఖ్య తగ్గింది. 245 కేసుల్లో 69 మంది మృతి చెందారు.
● రహదారి భద్రత చర్యల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 2024 లో 3,448 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిపై ఈ ఏడాది 9,148 కేసులు, సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడిపిన వారి మీద 900 కేసులు నమోదు చేశారు. మైనర్ డ్రైవింగ్ కేసులు 2023లో కేవలం 23 ఉంటే.. ఈ ఏడాది ఏకంగా 178 నమోదు కావడం గమనార్హం. ఎంవీ నిబంధనలు అతిక్రమించిన వారిపై ఈ ఏడాది 36,054 ఈ చలానాలు విధించారు.
ఎస్పీ ఏమన్నారంటే.. : రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చి.. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. బ్లాక్ స్పాట్‌లను గుర్తించి, వివిధ శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీస్ అధికారులు.. వారి పరిధిలోని రహదారులు మీద ఏర్పడిన గుంతలు పూడ్చడం, మలుపుల వద్ద తుప్పలు/డొంకలు తొలగించడం, భద్రత ప్రమాణాలకు సంబంధించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలను తగ్గించగలిగామని చెప్పారు. హెల్మెట్ లేకపోవడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి.. రహదారి భద్రతా నియమాలు పాటించేలా చైతన్యం చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment