భామిని పొగ మంచు ప్రభావంతో కప్పేసిన గ్రామీణ రహదారి
పార్వతీపురంటౌన్: మన్యం వాసులను చలి వణికిస్తోంది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రత అమాంతం తగ్గిపోవడం, మంచు దట్టంగా కురుస్తుండడంతో వాతావరణం ఒక్కసారి చల్లబడింది. ఉదయం 9 గంటలు కానిదే సూర్యుడు కనిపించడం లేదు. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలో గురువారం 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. చలి నుంచి రక్షణ పొందేందుకు కొందరు చలి మంటలు కాగుతుండగా, మరికొందరు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
ఉష్ణోగ్రతల నమోదు ఇలా...
గుమ్మలక్ష్మీపురం గిరిజన ప్రాంతాల్లో గురువారం 12 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, కురుపాంలో 12.5, జియమ్మవలసలో 13.0, కొమరాడలో 13.2, గరుగుబిల్లిలో 13.0, సీతానగరంలో 14.0, బలిజిపేటలో 14.0, పాలకొండలో 14.5, భామినిలో 13.0, సీతంపేటలో 13.0, వీరఘట్టంలో 13.0, సాలూరులో 13.0, పాచిపెంటలో 13.0, మక్కవలో 14.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వృద్ధులకు తప్పని అవస్థలు
ప్రస్తుత వాతావరణం వృద్ధులు, చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నడక, ఇతర వ్యాపకాలతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారికి కఫం చేరి, ఆయాసానికి దారి తీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ శ్వాస అవసరమయ్యే రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
చుట్టుముడుతున్న ఆరోగ్య సమస్యలు
జిల్లాలో పెరుగుతున్న చలి ప్రభావంతో వృద్ధులు, చిన్నారులను ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. జ్వరం, దగ్గు జలుబుతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోయింది. వృద్ధులు, ఆస్తమా పీడితులు ఆస్పత్రుల పాలవుతున్నారు.
దాదాపు పదిరోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో ఆస్తమా, ఇతర శ్వాస సుంబంధిత ఇబ్బందులతో చికిత్సలు పొందేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment