ఈ ఏడాదికి ఎగనామమే!
తల్లికి వందనం..
● ప్రస్తుత విద్యాసంవత్సరంలో లేనట్లే.. ● వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేసే యోచన
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం తల్లికి వందనమని చెప్పి.. ఎగనామం పెట్టింది. తాము అధికారంలోకి వస్తే కుటుంబంలో చదువుకున్న పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ పథకం కింద ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు.. మొదటి ఏడాది ఆ పథకం ఊసే లేకుండా చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.15 వేలు చొప్పున క్రమం తప్పకుండా అందుకునే వారమని.. చంద్రబాబు, ఆ పార్టీ నాయకుల మాటలు విని మోసపోయామని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలను చదివించేదెలా అంటూ మదనపడుతున్నారు.
క్యాబినెట్ భేటీలోనూ ఇవ్వని స్పష్టత
పేద విద్యార్థులను చదివించేందుకు ఏ తల్లీ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి.. అమ్మ ఒడి పథకం కింద కుటుంబంలో ఒకరికి రూ.15 వేలు చొప్పున ఏటా క్రమం తప్పకుండా తల్లి ఖాతాలో నేరుగా జమ చేసేవారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్న తేడా లేకుండా బీపీఎల్ కుటుంబాలందరికీ లబ్ధి కలిగించారు. ఆ డబ్బులతో చదువుకయ్యే అదనపు ఖర్చులు తల్లిదండ్రులకు ఒడ్డెక్కిపోయేవి. ఎన్నికల ముందు లబ్ధి పొందేందుకు చంద్రబాబు.. తన సూపర్ సిక్స్ ఎన్నికల మేనిఫెస్టోలో ‘పిల్లలను చదివించే బాధ్యత నేను తీసుకుంటా.. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే.. అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం’ అని ప్రకటించారు. గత జూన్‌తో 2024–25 విద్యాసంవత్సరం ప్రారంభమైంది. దాదాపు నెల రోజులు దాటిన తర్వాత తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను జారీ చేసింది. బీపీఎల్ కుటుంబాలకు చెందిన తల్లులకు ఏడాదికి రూ.15 వేలు సాయం అందిస్తామని అందులో పేర్కొన్నారు. ఎంతమంది పిల్లలుంటే.. అంతమందికీ అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. విద్యార్థులకు 75 శాతం హాజరు నిబంధన పెట్టింది. దీనిపై విమర్శలు వ్యక్తమవ్వడంతో.. తామింకా ఎటువంటి మార్గదర్శకాలూ జారీ చేయలేదని కూటమి ప్రభుత్వం మాట దాటేసింది. ఆ తర్వాత పలు క్యాబినెట్ భేటీలు జరిగినా.. అసెంబ్లీ సమావేశాలైనా పథకంపై ఎక్కడా చర్చకు రాలేదు. తాజాగా శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఆమోదం తెలపలేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని చర్చకు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాదికి పథకానికి ఎగనామం పెట్టేసినట్లేనని జిల్లాలో ఉన్న సుమారు 2.81 లక్షల బీపీఎల్ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏరు దాటాక తెప్ప తగలెయ్యడమంటే ఇదేనని.. చంద్రబాబు మాటలు నమ్మి నిలువునా మోసపోయామని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment