పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
పార్వతీపురం: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండేలా చూడాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సీడీపీఓలకు సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత శాఖాధికారులతో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కేంద్రంలో శతశాతం పిల్లల హాజరు ఉండేలా చూడాలన్నారు. పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలన్నారు. నులి పురుగుల సమస్య ఉన్న పిల్లల్లో ఎదుగుదల ఉండదని, ఏడాది దాటిన పిల్లలకు ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలని సూచించారు. ఆకుకూరలు, రాగులు, జొన్నలు వంటి వాటిని ఆహారంలో తీసుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు పరిశుభ్ర వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచిగా పనిచేసిన అంగన్‌వాడీ వర్కర్ల పేర్లను గణతంత్ర దినోత్సవ అవార్డులకు ప్రతిపాదించాలని ఐసీడీఎస్ పీఓలను ఆదేశించారు. బాల్య వివాహాలు నిర్మూలించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పథక సంచాలకులు టి.కనకదుర్గ, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్‌మోహనరావు, జిల్లా శిశు సంరక్షణ అధికారి సత్యనారాయణ, టాటా విజయవాహిని ట్రస్టీ సుబ్రహ్మణ్యం, సీడీపీఒలు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment