స్నేహితుడి హత్య కేసులో నిందితుడి అరెస్టు
పూసపాటిరేగ: మండలంలోని ఎరుకొండ గ్రామంలో గొర్లె పవన్‌కుమార్‌ను (21) హత్య చేసిన నిందితుడైన స్నేహితుడు బొంతు అప్పలనాయుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ తెలిపారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మృతుడు పవన్‌కుమార్ పూసపాటిరేగ మండలంలో ఇళ్లకు స్నేహితులతో కలిసి పెయింటింగ్ వేసేవాడు. స్నేహితుల్లో ఒకరైన బొంతు అప్పలనాయుడు పెయింటింగ్ వేయడం ద్వారా వచ్చిన డబ్బులను పెయింటింగ్ పనులు చేసే వారందరికీ పంచేవాడు. పెయింటింగ్ వేసిన వారిలో ఒకరైన గొర్లె పవన్‌కుమార్‌కు సంబంధించిన వెయ్యి రూపాయలు బొంతు అప్పలనాయుడు ఇవ్వాల్సి ఉండడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. స్నేహితుల వద్ద తనను పవన్‌కుమార్ అవమానపరుస్తున్నాడని అప్పలనాయుడు కక్షపెంచుకున్నారు. పవన్‌కుమార్‌ను ఎలాగైనా హత్య చేయాలని పన్నాగం పన్నాడు. గోడలకు సున్నాలు వేసిన బ్లేడును జేబులో ఉంచుకుని ఈ నెల 5వ తేదీ రాత్రి మద్యం తాగి పవన్‌కుమార్ వద్దకు అప్పలనాయుడు వచ్చాడు. ఎరుకొండ గ్రామంలో వైఎస్సార్ విగ్రహం వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. కొంతసేపటి తరువాత పవన్‌కుమార్‌ను అప్పలనాయుడు బైక్‌పై ఎక్కించుకుని గ్రామం శివారుకు తీసుకువెళ్తుండగా పవన్‌కుమార్ ఇంటివద్దకు వచ్చేసరికి బైక్‌పైనుంచి దూకేశాడు. అక్కడ ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరగడంతో పథకం ప్రకారం వెంటతెచ్చుకున్న కత్తితో పవన్‌కుమార్ కడుపులో అప్పలనాయుడు నాలుగు పోట్లు పొడిచేశాడు. పవన్ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న పవన్ తల్లి బంగారమ్మ వచ్చే లోపు అప్పలనాయుడు పరారయ్యాడు. పవన్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న అప్పలనాయుడు విశాఖపట్నం వెళ్లి పోవాలని ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అప్పలనాయుడిని కోర్టుకు తరలించారు. ఆయనతో పాటు ఎస్సై దుర్గాప్రసాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment