విజయనగరం క్రైమ్: విజయనగరం మహిళా పోలీస్‌స్టేషన్‌లో 2021లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయిలు పట్టణానికి చెందిన కోడూరు విజయకుమార్, కోడూరు శైలజలకు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి మూడేళ్ల జైలు, రూ. 2,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసు వివరాలను ఎస్పీ వకుల్ జిందల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలోని వీటీ అగ్రహారం బీసీ కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు గొడవపడి విడిపోగా తర్వాత తల్లి పట్టణానికి చెందిన గాడీఖానా రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న కోడూరు విజయకుమార్ అనే వ్యక్తితో ఉంటోంది. బాలిక వీటీ అగ్రహారం బీసీ కాలనీలో ఉంటున్న అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటోంది. అమ్మఒడి డబ్బుల విషయమై రైల్వేక్వార్టర్స్‌లో ఉంటున్న తల్లి కోడూరు శైలజ ఇంటి దగ్గరకు బాలిక వెళ్లగా ఆ సమయంలో అక్కడ ఉన్న మారటి తండ్రి కోడూరు విజయకుమార్ బాలికను లైంగింకగా వేధించగా దానికి తన తల్లి కోడూరు శైలజ ప్రోత్సహించింది. ఈ మేరకు బాలిక విజయనగరం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్సై పి.శ్యామలాదేవి పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదుచేసి నిందితులను అరెస్టు చేసి, అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పూర్తయ్యే విధంగా మహిళా పీఎస్ సీఐ ఈ.నరసింహమూర్తి చర్యలు చేపట్టగా, కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో త్వరితగతిన ముద్దాయిలకు శిక్షపడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment